09-07-2025 12:18:13 AM
నగదు బహుమతి అందించిన పోలీస్ కమిషనర్
సిద్దిపేట కలెక్టరేట్, జూలై 8: గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి శివారులో కొద్దిరోజుల క్రితం జరిగిన వృద్ధురాలు నల్ల సత్తవ్వ (70) హత్య కేసును త్వరగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న గజ్వేల్ పోలీసులను సిద్దిపేట పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ ప్రశంసించి నగదు బహుమతులను అందజేశారు.
వ్యవసాయ పనుల్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించిన కేసు ప్రారంభంలో ఆధారాలు లేనప్పటికీ గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజు నేతృత్వంలోని క్రైమ్ విభాగం, ఐటీ సెల్ బృందాలు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించారు. అరెస్టైన నిందితుడు కిచ్చిగారి శివ శంకర్ (36) వృత్తిరీత్యా ఆయుర్వేదిక బోన్ సెట్టర్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందినవాడు.
అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కొడవలి, దొంగలించిన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో చూపిన ధైర్యానికి గుర్తింపుగా పోలీస్ కమిషనర్ డా. బి. అనురాధ గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, ముత్యం రాజుతో పాటు క్రైమ్ విభాగం, ఐటీ సెల్కు చెందిన ఏఎస్‌ఐ యాదగిరి, కానిస్టేబుళ్లు నరేందర్, వెంకటేష్, రవి, దివ్య, శ్రీకాంత్, రమేష్, సురేందర్, హోంగార్డు నగేశ్లకు నగదు రివార్డులు అందజేసి మాట్లాడారు. ప్రతి కేసును సవాల్గా తీసుకొని అంకితభావంతో పని చేసే పోలీసులే ప్రజల నమ్మకాన్ని గెలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, ఎస్బి ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.