23-08-2025 07:48:48 PM
సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి..
ముస్తాబాద్ (విజయక్రాంతి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని యాదవ సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై మండల పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి(CI Mogili) సూచించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు ముందుగా పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. మండప వివరాలు, ప్రతిమ ఎత్తు, నిమజ్జనం తేదీ, ప్రదేశం వంటి సమాచారాన్ని తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌లో నమోదు చేసి, ఆన్‌లైన్‌లో అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలు మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా ఆదేశించారు.
భద్రతా చర్యలు తప్పనిసరి...
విద్యుత్ కనెక్షన్లు విద్యుత్ శాఖ అనుమతితోనే తీసుకోవాలని, నాణ్యత గల వైర్లను వాడాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు నివారించడానికి నీటి బకెట్లు, ఇసుక బస్తాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలని, శబ్ద కాలుష్యం తగ్గించడానికి రెండు స్పీకర్లకే పరిమితం కావాలని తెలిపారు. మండపం వద్ద 24 గంటలు వాలంటీర్ ఉండాలి. కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు.
నిషేధిత కార్యక్రమాలు నిలిపివేయాలి...
మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు, అసభ్యకర నృత్యాలు పూర్తిగా నిషేధమని పోలీసులు హెచ్చరించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగాలు, పాటలు చేయరాదని తెలిపారు. పోలీస్ తనిఖీల కోసం ప్రతి మండపం వద్ద పాయింట్ పుస్తకం తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు.మండపాల వద్ద అనుమానాస్పద వస్తువులు, బ్యాగులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ నవరాత్రులు శాంతియుతంగా, సురక్షితంగా సాగేందుకు నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని సీఐ మొగిలి కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.