24-08-2025 12:23:18 AM
- పట్టాలెక్కనున్న పటాన్‌చెరు ఆదిలాబాద్ రైల్వేలైన్
- ఆర్మూరు మీదుగా వెళ్లేలా ప్లాన్
- తగ్గనున్న సుమారు 100 కి.మీ దూరం
- ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు మెరుగవ్వనున్న రైల్వే కనెక్టివిటీ
- ఢిల్లీ చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త లైన్
- అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా ఆదిలాబాద్ మారేందుకు అవకాశం
హైదరాబాద్, ఆగస్టు (విజయక్రాంతి): రాజధాని నుంచి నేరుగా ఆదిలా బాద్‌కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ప్రజలు కోరుకుంటున్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు ఇప్పటికే ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎస్‌ఎల్)కు కేంద్రం ఆమోదం తెలుపగా.. ప్రస్తుతం డీపీఆర్ దశలోఈ రైల్వే ప్రాజెక్టు ఉంది.
పటాన్‌చెరు రైల్వేలైన్‌గా పిలవబడే ప్రతిపాదిత ప్రాజెక్టు పట్టాలెక్కితే ప్రస్తుతం ఉన్న లైన్‌తో పోలిస్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకునేందుకు సుమారు 100 కి.మీ దూరం తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న లైన్‌లో ప్రయాణిస్తే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకునేందుకు మహారాష్ట్రకు వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్ రావాల్సి వస్తోం ది. ఫలితంగా ప్రయాణికులు బస్సుల్లోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త లైన్ ఏర్పడితే 100 కి.మీ దూరంతో తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా దాదాపు 4 గంటలకు పైగా తగ్గి కష్టాలు తప్పుతాయి.
ప్రస్తుతం ఆదిలాబాద్ వెళ్లాలంటే
ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లాలంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మేడ్చల్, అక్కన్నపేట, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ఉమ్రి, ముధ్కేడ్ జంక్షన్, భోకర్, హిమాయత్‌నగర్, సహస్రఖుండ్, బోధాడి బుజ్రగ్, కిన్వత్ స్టేషన్లను దాటాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ ఈ మార్గంలో 410 కి.మీ కావడం విశేషం. సికింద్రాబాద్ నుంచి రైలు మార్గం ద్వారా నిజామాబాద్ చేరుకునేందుకు 150 కి.మీ మాత్రమే అయితే.. అక్కడి నుంచి ఆదిలాబాద్ చేరుకునేందుకు మరో 260 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ రోడ్డు మార్గంలో చేరుకునేందుకు దాదాపు 150 కి.మీ దూరం మాత్రమే. అదే రైలు మార్గంలో మాత్రం మహారాష్ట్ర ద్వారా వెళ్లాల్సి రావడంతో అదనంగా 100 కి.మీ పైగా ఎక్కవ అవుతోంది. మొత్తంగా 9.40 గంటల సమయం ప్రయాణిస్తే తప్ప హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది.
దూరంతో పెరిగిన సమయం
తిరుపతి నుంచి ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో చర్లపల్లి నుంచి నిజామాబాద్ చేరుకునేందుకు దాదాపుగా 150 కి.మీ.కు 3.30 గంటల సమయం పడుతుంది. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లేందుకు మాత్రం 6.10 గంటల సమయం తీసుకుంటోంది. రాత్రి 11.40 నిజామాబాద్‌లో బయలుదేరే ఈ రైలు ఉదయం 5.49 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుంది. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు చుట్టూ తిరిగిరావడంతో 100కి.మీ మేర దూరం పెరుగుతోంది. ఫలితంగా దూరంతో పాటు ప్రయాణ సమయం పెరిగి ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
నాగులపల్లి నుంచి ఆదిలాబాద్ వరకు
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్లేందుకు 9.40 గంటల నుంచి 10 గంటల సమయం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త రైల్వే లైన్ ఉండనుంది. ఈ కొత్త లైన్ పేరు పటాన్‌చెరు ఆర్మూరు రైల్వే లైన్. అయితే ఈ లైన్ పటాన్‌చెరు వద్ద కాకుండా సికింద్రాబాద్ మార్గంలోని వట్టి నాగులపల్లి స్టేషన్ నుంచి ప్రారంభం అవుతుంది. డీపీఆర్ రాకపోయినా రైల్వే వర్గాల సమాచారం మేరకు ఈ రైల్వే లైన్ వట్టి నాగులపల్లి, సంగారెడ్డి, అల్లాదుర్గ్, నిజాంసాగర్, భాన్స్‌వాడ, రుద్రూర్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిర్మల్, ధానూర్, నేరేడిగొండ, ఇచ్చోడ, ఆదిలాబాద్ వరకు కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం బోధన్ నుంచి నిజామాబాద్ మీదుగా ఆర్మూర్ వరకు రైల్వే లైన్ ఉంది. కాబట్టి కొత్త లైన్‌ను వట్టినాగులపల్లి నుంచి బోధన్ వరకు ఒక ప్యాకేజీగా, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు మరో ప్యాకేజీగా చేపట్టనున్నారు.
ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా
2023లో ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్‌ఎల్‌ఎస్) కోసం ఐదు ప్రాధాన్యతా మార్గాలలో పటాన్‌చెరు ఆర్మూర్ లైన్ కూడా ఉంది. ఈ రైల్వే లైన్ పూర్తయితే ఉత్తర తెలంగాణకు హైదరాబాద్ నుంచి నేరుగా కనెక్టివిటీ ఏర్పాటు అవుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు మరో రైలు మార్గం కూడా ప్రత్యమ్నాయంగా మారుతుంది. ప్రస్తుతం సికింద్రా బాద్ కాజీపేట మీదుగా మాత్రమే ఢిల్లీ వెళ్లేందుకు అవకాశం ఉంది.
కొత్త లైన్ ఏర్పాటు అయితే ప్రస్తుతమున్న సికింద్రాబాద్ నిజామాబాద్ మార్గం నుంచి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ చేరుకుని అక్కడి నుంచి అక్కడి నుంచి నాగ్‌పూర్ మీదుగా ఢిల్లీ వెళ్లవచ్చు. అలాగే వట్టినాగులపల్లి నుంచి బోధన్ మీదుగా ఆదిలాబాద్ వరకు నిర్మించే కొత్త మార్గం ద్వారా కూడా ఢిల్లీ వెళ్లవచ్చు. ఫలితంగా ఆదిలాబాద్ పెద్ద జంక్షన్‌గా రూపుదిద్దుకునేందుకు చాలా అవకాశాలున్నాయి. మరోవైపు వట్టినాగులపల్లి సంగారెడ్డి మీదుగా రైల్వే లైన్ రావడం వల్ల నగరం నుంచి సంగారెడ్డికి లోకల్ రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంది.
కొత్త మార్గం ద్వారా తగ్గనున్న దూరం
నాగులపల్లి నుంచి ఆర్మూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు నిర్మించే కొత్త రైల్వే లైన్ 317 కి.మీ మేర ఉంటుందని అంచనా. రైల్వే మంత్రిత్వ శాఖ సాధ్యమైనంత త్వరగా డీపీఆర్‌ను రూపొందించి ఆమోదించే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. మొదటి దశలో ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ పట్టణాల మధ్య 137 కి.మీ. నూతన మార్గాన్ని దాదాపు రూ.3,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని భావిస్తున్నారు.
ఇక వట్టినాగులపల్లి బోధన్ మధ్య సుమారు 180 కి.మీ లైన్ తర్వాతి దశలో చేపట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాంత ఎంపీల డిమాండ్ మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చినందున కేంద్రం ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చనుందని తెలుస్తోంది. డీపీఆర్ వచ్చిన వెంటనే ఆమోదించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు కేంద్రం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కేంద్రమే మొత్తం ప్రాజెక్టు ఖర్చును భరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.