24-08-2025 12:28:34 AM
అశ్వాపురం,(విజయక్రాంతి): గిరిజన మహిళలు స్వశక్తితో చిన్న తరహా కుటీర పరిశ్రమలు నెలకొల్పుకొని వారి కుటుంబాన్ని పోషించు కోవడమే కాక, పదిమందికి ఉపాధి కల్పించడం సంతోషకరమని, వారు తయారు చేస్తున్న కందిపప్పు బ్రాండింగ్, డిజైనింగ్ చేసి మార్కెట్ పరంగా వెసులుబాటు కల్పించి ఆర్థికంగా లాభాల బాటలో నడిచే విధంగా కృషి చేస్తున్నట్లు ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. శనివారం అశ్వాపురం మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలో నెలకొల్పిన సమ్మక్క, సారక్క మహిళ కందిపప్పు ఉత్పత్తి కేంద్రమును యూనిట్ ను ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశాల మేరకు ఐటీడీఏ, ఐటీసీ సంస్థ అధికారులు సందర్శించి మహిళలు తయారు చేస్తున్న కందిపప్పును పరిశీలించారు.
కందిపప్పు ఉత్పత్తి కేంద్రం వివరాలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులైన గిరిజన మహిళలు 5 గురు రూ.13.37 లక్షల సబ్సిడీతో రూ.22.29 లక్షల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన కందిపప్పు ఉత్పత్తి కేంద్రం యూనిట్ ను వారు పరిశీలించారు. గిరిజన మహిళలు అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పుకొని జీవనోపాధి పెంపొందించుకోవడం చాలా అభినందించదగ్గ విషయమన్నారు. వారు తయారు చేస్తున్న కందిపప్పును పాలిష్ లేకుండా పాలిష్ తో ప్రజలకు సరసమైన ధరలకు అమ్మకాలు జరుపుకోవడానికి, ప్రజలు ఆకర్షించే విధంగా ప్యాకింగ్, డిజైనింగ్ బ్రాండింగ్ రూపొందించి మార్కెట్ సౌకర్యం కల్పించే విధంగా ఐటీసీ వారి సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
గిరిజన మహిళలు తయారుచేసిన కందిపప్పును చక్కటి డిజైనింగ్ ప్యాకింగ్ బ్రాండింగ్ సౌకర్యం మహిళల సహకారంతో మరియు ఐటీసీ వారి చేయూతతో చక్కటి డిజైనింగ్ తో రూపొందిస్తామని, మహిళలు మార్కెటింగ్ సౌకర్యం కల్పించుకొని అమ్మకాలు జరుపుకొని లబ్ధి పొందాలన్నారు. ప్రజల యొక్క డిమాండ్ ను బట్టి పాలిష్ లేక అని పాలిష్ లేకుండా కందిపప్పును మీ గ్రామంలోని పక్క మండలాలలోని గ్రామాలలోని కిరాణా షాప్ లు, సంతలు, ఇంటింటికి తిరిగి అమ్మకాలు జరుపుకోవాలని, ముడి సరుకులు నాణ్యతతో కూడినవి కొనుగోలు చేసి, స్వచ్ఛమైన కందిపప్పును అమ్మకాలు జరిపి పరిశ్రమలు లాభాల బాటలో నడిపించుకునే విధంగా మహిళలు కృషి చేయాలన్నారు.