23-08-2025 11:52:28 PM
ఎల్బీనగర్: బాల్యవివాహాలు అడ్డుకుని, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్ అందించాలని హైకోర్టు న్యాయమూర్తి పి.శామ్ కోషి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు పి.శామ్ కోషి, అభినంద్ కుమార్ శవిలి, చలపతి రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పి.శామ్ కోషి మాట్లాడుతూ.. బాల్య వివాహాల నిర్మూలన కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదని, ఇది ఒక సామాజిక, మానవతా సమస్య అన్నారు. బాల్య వివాహాలు ఒక తరం భవిష్యత్తును శాశ్వతంగా ప్రభావితం చేసే ఘోరమైన పనిగా పేర్కొన్నారు.
మన దేశ చట్టం ప్రకారం బాలికలకు 18 ఏండ్లు, బాలురకు 21 ఏండ్ల వయస్సు నిండకముందే వివాహం చేయడం చట్టపరంగా నేరమని తెలిపారు. ఈ చట్టం ఉన్నప్పటికీ బాల్యవివాహాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను మార్చాలంటే, న్యాయవ్యవస్థ మాత్రమే కాదు, సమాజం మొత్తం కలిసికట్టుగా స్పందించాలని కోరారు. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, యువత, ఆంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారా లీగల్ వాలంటీర్స్ ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. చైల్డ్ మ్యారేజ్ వ్యతిరేక చట్టాలు, సామాజిక బాధ్యతలపై న్యాయమూర్తులు అభినంద్ కుమార్ శవిలి, చలపతి రావు ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ పంచాక్షరి మాట్లాడుతూ.. "చైల్డ్ మ్యారేజ్ నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా లీగల్ సర్వీసెస్ అధికారం కృషి చేస్తుందన్నారు. చట్ట పరిజ్ఞానంతో పాటు, బాధితులకు న్యాయ సహాయం అందించడమే మా లక్ష్యం" అని వివరించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ కర్ణ కుమార్ మాట్లాడుతూ.. చైల్డ్ మ్యారేజ్ వల్ల బాలికలు విద్యను కోల్పోతారని, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. అనంతరం జన్మతః డయాబెటిస్ తో బాధపడుతున్న లికిత అనే బాలికకు రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వీల్ చైర్ అందజేశారు. బార్ అసోసియేషన్ సభ్యులు ప్రతాప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కార్తిక్ లికితకు రూ.25వేల ఆర్థిక సాయం అందజేశారు.