calender_icon.png 15 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు

15-08-2025 01:36:19 AM

-బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు

-చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు 

-రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 

ఎల్బీనగర్, ఆగస్టు 14 : నగరంలో దేశీయ తయారీ తుపాకులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న బీహార్ రాష్ట్రానికి ఇద్దరిని గురువారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు తుపాకులు, పది బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ లోని క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ర్టంలోని ఔరంగాబాద్, థానాకు చెందిన శివకుమార్(32) కూలిగా పని చేస్తున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్ లోని పెద్ద చల్లపల్లిలో నివాసం ఉంటున్నాడు.

ఇతడు గంజాయి కేసులో నిందితుడు. సులభంగా డబ్బు సంపాదించాలని ఇందుకు కోసం బీహార్ లో తయారు చేసిన తుపాకులను హైదరాబాద్ లో విక్రయించాలని పథకం వేశాడు. ఇందుకోసం తన ప్రాంతానికి చెందిన తుపాకుల తయారీ నిపుణుడు, బావమరిది కృష్ణ పాశ్వాన్(28)ను సంప్రదించాడు. హైదరాబాద్ లో తుపాకులు విక్రయించి, సులభంగా డబ్బు సంపాధించ వచ్చని బావమరిదికి ఆశ పుట్టించాడు.

ఇందుకు ఒప్పుకున్న కృష్ణ పాశ్వాన్ తాను తయారు చేసిన మూడు తుపాకులు, పది బుల్లెట్లు తీసుకుని రోడ్డు మార్గంలో హైదరాబాద్ లో ఉంటున్న శివకుమార్ వద్దకు చేరుకున్నాడు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో తుపాకులను విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు తుపాకులు, బుల్లెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు దాచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ ఉన్న ఆయుధాలను పోలీస్ స్టేషన్ అప్పగించాలని సీపీ సుధీర్ బాబు సూచించారు. సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎస్వోటీ డీసీపీ రమణా రెడ్డి, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ నర్సింహ రెడ్డి, ఎస్వోటీ ఇన్ స్పెక్టర్ జంగయ్య, సుధాకర్, ఎస్సు సాయి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.