15-08-2025 01:38:34 AM
- జలదిగ్బంధంలో వీరిశెట్టిపల్లి
- నీట మునిగిన పంట పొలాలు
తాండూరు, ఆగస్టు 14 (విజయక్రాంతి) : మూడు రోజుల నుండి నియోజకవర్గంనీ పెద్దముల్, యాలాల, బషీరాబాద్, తాండూర్, మండలాలతో పాటు తాండూర్ మున్సిపల్ పరిధిలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూర్ కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. తాండూర్ మండలం ‘వీర్ శెట్టిపల్లి’ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అర్ధరాత్రి నుండి గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో బాహ్య ప్రపంచానికి తెగిపోయిన సంబంధాలు.
పంట పొలాల్లోకి వర్షపు నీరు భారీగా చేరడంతో వంటలు నీట మునుగాయి. బషీరాబాద్ మండలం కంసాన్పల్లి (ఎం) గ్రామంలోసంఘని నరేష్ అనే రైతు తనకున్న అయితే ఎకరాల పొలంలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. వరదగా పొలంలో నుండి నీరు పారడంతో దాదాపు మూడు ఎకరాల పత్తి పంట నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఇక మరోవైపు బషీరాబాద్ మండలం జీవన్గీ గ్రామ శివారులో ఉన్న శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయం మరియు కళ్యాణమండపం నీట మునిగింది.
వరద నీరు గ్రామంలోకి సైతం వచ్చి చేరింది. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో నిలిపి ఉంచిన ప్రైవేటు స్కూల్ బస్సు నీట మునగడంతో రెండు ట్రాక్టర్ల సాయంతో నీటి నుండి బయటికి అతి కష్టం మీద తీశారు.ఇక పెద్దేముల్ మండలంలో కూడా గత రాత్రి భారీ వర్షం కురవడంతో జనగాం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
యాలాల మండలం తిమ్మాయిపల్లి సమీపంలో చెరువు తూములు నిర్మించకపోవడంతో వరద నీరు పంట పొలాల్లోకి నీరు చేరి పంటలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోవాలని నియోజకవర్గ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి కోరారు.
జిల్లాలో భారీ వర్షాలు అనంతగిరికి పర్యాటకుల రాకను నిలిపివేసిన అధికారులు
వికారాబాద్, ఆగస్టు 14 (విజయ క్రాంతి) : రెండు రోజులుగా వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్ పల్లి, లక్నాపూర్, సర్పన్ పల్లి, శివసాగర్ ప్రాజెక్టులు నిండి అలుగు వెళ్లి పారుతున్నాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో చాలా చోట్ల పంట వర్షపు నీటిలో మునిగిపోయింది. తాండూరు నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున నీటి ప్రాజెక్టులు, వాగులు వత్తెనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.
జిల్లాలో భారీగా కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి జిల్లాలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాగసముందర్ వద్ద కోట్ పల్లి ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలో మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. వరదలు వచ్చే ప్రాంతాల్లో ఎలాంటి నష్టాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అనంతగిరికి పర్యాటకుల రాక బంద్..
భారీ వర్షాల నేపథ్యంలో అనంతగిరి కి పర్యాటకుల రాకను నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ అధికారులను ఆదేశించారు. దీంతో ఆలయ పరిసరాలతో పాటు అనంతగిరి అడవిలోని పలు పర్యాటక ప్రదేశాలలో పర్యాటకులు రాకుండా ఫారెస్ట్, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈనెల 17వ తేదీ వరకు కూడా పర్యాటకులు అనంతగిరి వైపు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.