25-08-2025 12:31:57 AM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ పరిధిలో 17 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక లైంగికదాడి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం ఘటన జరుగగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని సుక్మా జిల్లాకు చెందిన బాలిక తమ గ్రామం నుంచి శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడుగురాళ్లపల్లి సమీపంలో గల గొల్లగుప్పలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉంది.
ఈ క్రమంలో బాలిక ట్రాలీ ఆటో ఎక్కి, గొల్లగుప్ప క్రాస్ రోడ్డు వద్ద దింపాలని కోరింది. ఆటో ఎక్కిన తర్వాత.. అందులో ఉన్న డ్రైవర్లు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆ తర్వాత లైంగికదాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితులు పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాధపురం వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద బాలికను వదిలి వెళ్లారు. అపస్మారక స్థితిలో రోడ్డు డివైడర్‌పై పడి ఉన్న బాలిక శరీరంపై పంటి గాట్లు, గాయాలు ఉండటంతో స్థానికులు ఐసిడిఎస్ అధికారులకు తెలియజేశారు.
వారు బాలికను కొత్తగూడెంలోని సుధగృహలో రాత్రి ఉంచి ఉదయం పాల్వంచ సీడీపీవో లక్ష్మీప్రసన్న నేతృత్వంలో విచారణ నిర్వహించారు. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ ఎడుగురాళ్లపల్లి కేసును తరలించినట్టు తెలుస్తోంది. ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాల మేరకు చర్ల, దుమ్ముగూడెం పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.