19-07-2025 01:49:07 AM
‘ప్రేక్షకులకు ముఖ్య ఇజ్ఞప్తి.. మన గరివిడి లక్ష్మి పోగ్రానికి బయల్దేరిందట. మరి ఆలస్యం సెయ్యకుండా రేపందరొచ్చియండి!’, ‘మన గరివిడి లక్ష్మి ఒచ్చేసింది.. ఇకన స్టేజిరెక్కి అగ్గిదీసేద్దంతే!’ అంటూ ప్రచార చిత్రాలకు ఉత్తరాంధ్ర యాసలో వ్యాఖ్యలు జోడించడం ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది ‘గరివిడి లక్ష్మి’ టీమ్. 1990లలో ఉత్తరాంధ్ర జానపద సాంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన జానపద కళాకారిణిగా గరివిడి లక్ష్మి పేరు ఆ ప్రాంత చరిత్రలో నిలిచిపోయింది.
ఆ గొప్ప బుర్రకథ కళాకారిణి జీవిత విశేషాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న తాజాచిత్రమే ‘గరివిడి లక్ష్మి’. ఇందులో ఆనంది టైటిల్ పాత్రలో నటిస్తోంది. నరేశ్ వీకే, రాశి, రాగ్ మయూర్, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్, ‘కంచరపాలెం’ కిషోర్, శరణ్య ప్రదీప్, కుశాలిని ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజాగా శుక్రవారం మేకర్స్ ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆనందిని ‘గరివిడిలక్ష్మి’ పాత్రలో పరిచయం చేశారు. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో లంగావోణీ ధరించి, రిక్షాలో కూర్చున్న ఆనంది ఒడిలో హార్మోనియంతో చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంది. “గరివిడి లక్ష్మి’ గ్రామీణ జీవనానికి, సంగీత వారసత్వానికి అద్భుతమైన ట్రిబ్యూట్‌లా ఉంటుంది. ఇది ఓ ఎమోషనల్ జర్నీ. సంస్కృతిపై ప్రేమతో రూపొందించిన వినోదాత్మక చిత్రమిది” అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్; సినిమాటోగ్రాఫర్: జే ఆదిత్య.