24 March, 2026 | 2:53 PM

చేతులు ఎత్తేసిన గ్యాస్ కంపెనీలు

24-03-2026 12:08 AM

గ్యాస్ కంపెనీల వద్ద నో స్టాక్ బోర్డులు

పెట్రోల్ కొరతతో బంక్ లను మూసివేసిన యజమాన్యాలు

గ్యాస్ సిలిడర్ల  కోసం గ్యాస్ కంపెనీ గోదాముల వద్ద ప్రజల పడిగాపులు

బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నట్లు ప్రచారం

తనిఖీలు చేపట్టని సంబంధిత అధికారులు

సమస్యను పరిష్కరించాలని కొరుతున్న ప్రజలు

కూసుమంచి, మార్చి 23(విజయక్రాంతి): యుద్దమేమో కానీ.. గ్యాస్ కోసం పల్లెల్లో ప్రజలు యుద్దం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అత్యంత నిత్యావసర వస్తువుగా మారిపోయిన వంట గ్యాస్ కొరత సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.. ఎప్పుడు గ్యాస్ అయిపోతుందేమోనని సామాన్య జనం బెంబేలేత్తే పరిస్థితి ఏర్పడింది.. మొన్నటి వరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైన గ్యాస్ కోరత ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో, మారుమూల గ్రామాల్లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది.

దీంతో ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం కంపెనీ కార్యాలయాల చుట్టు ప్రదక్షణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. గ్రామాల్లో సిలిండర్ల కొరత కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది.. సిలిండర్ల కోసం ప్రజలు షాపులకు పరుగులు తీస్తున్నారు.. గ్యాస్ కంపెనీలకు పోన్ల ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆన్ లైన్ లో బుకింగ్ కావడంలో తీవ్ర జాప్యం కనిపిస్తోంది.. దీంతో ప్రజలు మరింత భయపడుతున్నారు.. దీంతో గ్యాస్ ఇన్ టైమ్ లో గ్యాస్ అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. వాణిజ్య, వంట గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తోంది.. వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా చాలా షాపులు, హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు మెను మార్చుకున్నారు. కొన్ని హోటళ్లలో కట్టెల పోయి ద్వారా వంటలు వండే పరిస్థితి ఏర్పడింది.

అలాగే వ్యాపార సంస్థలు, మెకానిక్ షాపులు, వాహనాల షోరూమ్ లు, గ్యాస్ లతో నడిచే ప్రతి ఒక్క వ్యాపార షాపుల యజమానులు గ్యాస్ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో, తండాల్లో, మారుమూల పల్లెల్లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గతంలో ఒక్క రోజుల్లోనే గ్యాస్ సిలిండర్ ఇంటిముందుకు వచ్చి డెలివరి చేసి వెళ్లే గ్యాస్ కంపెనీ వాహనాలు అడ్రస్ లేకుండా పోయాయి. దీంతో రోజుల తరబడి ఇంటిముందు సిలిండర్లు ఉంచిన ఫలితం లేకుండా పోతుందని ప్రజలు వాపోతున్నారు. గ్యాస్ లేకపోతే వంట వండటం చాలా కష్టతరమవుతుందని ప్రజలు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. 

గ్యాస్ కంపెనీ ఆఫీసులకు తాళాలు

పాలేరు నియోజకవర్గంలో కొన్ని ప్రధాన కంపెనీలు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఒక్కోక్క కంపెనీకి వేలాధి కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కోక్క ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లోకి కంపెనీ వాహనాల్లో సిలిండర్లను తీసుకుచ్చి డెలవరి ఇచ్చే వెళ్లేవారు. గ్యాస్ కొరత వల్ల కంపెనీ వాహనాలు వారం రోజులైన రాకపోవడంతో ప్రజలు సిలిండర్లను తీసుకుని ఆటోల ద్వారా, మోటర్ సైకిల్ ద్వారా ఆయా కంపెనీల వద్దకు వెళ్లి తెచ్చుకోవచ్చని ఆశ పడుతున్నారు.

కానీ ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా ఆయా గ్యాస్ కంపెనీ ఆపీసులకు తాళాలు వేసి నో స్టాక్ అంటూ బోర్డు లను ఏర్పాటు చేశారు. కంపెనీ కార్యాలయం వద్దకు వచ్చిన ప్రజలకు నోటీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేనిదే వంట పూర్తి కాదు.. వంట వండితేనే పూట గడిచేసే పరిస్థితి ఏర్పడింది.. నిత్యం గ్యాస్ లకు అలవాటు పడిన ప్రజలు కట్టెల పోయ్యి పై వంటలు వండాల్సిన పరిస్తితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్త్తున్నారు. ఈ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రజలకు త్వరగా గ్యాస్ అందే విధంగా చూడాలని, గ్యాస్ కొరత లేకుండా చూడాలని  ప్రజలు ప్రభుత్వాన్ని కొరుతున్నారు. 

పెట్రోల్ బంకులకు అందని ఆయిల్.. బాంక్ లు మూసివేత..?

ఒక వైపు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మరో సమస్య ఎదురైంది.. మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు గ్యాస్ కొరతతో పాటు ఆయిల్ కొరత రావడంతో ఇన్ టైమ్ లో పెట్రోల్, డిజిల్ బంక్ లకు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పాలేరు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ లను మూసి వేశారు. యుద్దం నేపథ్యంలో పెట్రోల్, డిజిల్ కొరత ఉందని పెట్రోల్ బంక్ ల్లో ప్లెక్సిలు పెడుతున్నారు. దీంతో పెట్రోల్ కొరత వచ్చే అవకాశం ఉందా..? అని ప్రజలు భయపడుతున్నారు. 

సమస్యను పరిష్కరిస్తారా..? అధికారులు పట్టించుకుంటారా..? 

రోజురోజుకు గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ సిలిండర్లు సప్లే చేసే డీలర్లు కావాలనే గ్యాస్ కొరత స్రుష్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. వాణజ్య సంస్థలకు, పెద్ద కంపెనీలకు గ్యాస్ ను సరఫరా చేసేందుకు గాను వంట గ్యాస్ లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి పుల్ స్టాఫ్ పడాలంటే కచ్చితంగా అధికారులు నిత్య పర్యవేక్షణ అవసరం. అధికారులు పట్టణ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నో స్టాక్ బోర్డులను పెట్టే కంపెనీ ఆపీసులను తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రజలకు సిలిండర్లు చేరాలంటే అధికారులు గ్రామాల్లో, తండాల్లో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గ్యాస్ కొరత లేకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు గ్యాస్ కొరత సమస్య పరిష్కరించేందుకు అత్యవసర సమావేశాలు నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.