18-09-2025 12:15:26 AM
హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుండడంతో గాజా సిటీ అగ్నిగుండంలా తయారైంది. గాజా సిటీలో దాదాపు 3వేల మంది హమాస్ మిలిటెంట్లు ఉన్నారని భావిస్తున్న ఇజ్రాయెల్, వారిని అంతమొందిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతుందని భా వించి వరుస దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇజ్రాయెల్ సైన్యం గాజాలో భూతల దాడులను ప్రారంభించింది.
దీంతో జనం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. అయితే గాజీ సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ఆదేశాలతో ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల మంది గాజాను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం ఒక్కరోజే గాజాను విడిచి వెళ్లిన వారి సంఖ్య 2.20 లక్షలకు పైగా ఉండడం గమనార్హం. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం దాకా జరిగిన దాడుల్లో 89 మంది మరణించగా.. వారిలో ఒక్క గాజా సిటీలోనే 78 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
మరోవైపు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ మాత్రం మంగళవారం ఉదయం ‘గాజా తగలబడుతోంది’ అని వ్యా ఖ్యానించడం చూస్తే హమాస్‌ను అంతమొందించే దాకా ఇజ్రాయెల్ ఊరుకునేలా లేదన్న విషయం మరోసారి స్పష్టమవుతున్నది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని ఐక్యరాజ్య సమితి మా నవ హక్కుల కౌన్సిల్ నియమించిన స్వతంత్ర నిపుణుల కమిషన్ తేల్చింది.
దీనిని అంతర్జాతీయ సమాజం అడ్డుకోవాలని, బాధ్యులను శిక్షించాలని మంగళవారమిచ్చిన నివేదికలో సూచించింది. 2023 అక్టోబర్‌లో హ మాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ జాతి విధ్వంసకర దాడులకు పాల్పడుతుందని పేర్కొంది. హమాస్ మీద కోపంతో గాజా, పాలస్తీనాల్లోకి సరకు రవాణాను అడ్డుకుంటుందని, హమాస్ దాడి తర్వాత రవాణా పూర్తిగా ఆ గిపోవడంతో గాజా వాసుల జీవనం దుర్భరంగా మారిపోయిందని వివరించింది.
ఫలితంగా పాలస్తీనా ప్రజలు ఆకలి కేకలతో కాలం వెల్లదీస్తు న్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక అందించిన రోజునే ఇజ్రాయెల్ గాజాలో భూతల దాడులు ప్రారంభించడం గమనార్హం. ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కా ల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చడంతో పాటు 251 మందిని బందీలుగా తీసుకెళ్లటంతో మొదలైన యుద్ధం రెండేళ్లు కావొస్తున్నా ఇంకా కొనసాగుతూనే ఉంది.
హమాస్ మతిమాలిన చర్య కా రణంగా ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజీ సిటీ మంటల్లో తగలబడిపోతుంది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న మారణ హో మంలో ఇప్పటివరకు కనీసం 64, 964 మంది చనిపోగా.. వీరిలో అధిక శాతం మహిళలు, పసిపిల్లలే ఉండడం శోచనీయం. ఈ మారణహోమం ఇలాగే కొనసాగితే గాజా జనాభాలో మూడోవంతు జనభాప్రమాదకర స్థితిలో పడనుంది. ఇప్పటికే ఆకలి కేకలతో మరణించిన వారి సంఖ్య 450 దాటింది.
ఇవిగాక పంపిణీ ట్రక్కుల వద్ద గూమిగూడుతున్నవారిని కాల్చిచంపటం నిత్యకృత్యం. నిత్యం క్షిపణులు, బాంబులతో ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతుంటే మౌనంగా తిలకించడం తప్ప పాలస్తీనీయులు చేయడానికి ఏమీ లేదన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. హమాస్ పూర్తిగా అ ంతమైతే తప్ప గాజాలో శాంతికి బాటలు పడేలా కనిపించడం లేదు.