31-12-2025 12:00:00 AM
దేవుడి చిత్రపటాలు, కోడ్ లాంగ్వేజ్ వినియోగం
గర్భస్రావం కోసం లక్షల్లో దండుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులు
క్రమంగా క్షీణించిపోతున్న బాలికల నిష్పత్తి
నాగర్ కర్నూల్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్ల ఆగడాలు నానాటికి శృతి మించుతున్నాయి. డబ్బు సంపాదనే లక్ష్యంగా చట్ట విరుద్ధమైన లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి నిబంధనలకు విరుద్ధంగా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. తల్లి గర్భంలోని పిండం ఎదుగుదల ఆరోగ్యం పరిరక్షణ కోసం అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరికరాలను వినియోగిస్తుంటారు.
రేడియాలజిస్టులు, గైనకాలజిస్టుల వెంట పనిచేసే కిందిస్థాయి సిబ్బంది చేత అల్ట్రా సౌండ్ స్కానింగ్ జరిపి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు స్కానింగ్ రూమ్ ప్రాంగణంలో దేవతామూర్తుల చిత్రపటాలు చిన్నపాటి విగ్రహాలు బాల బాలికల బొమ్మలను ఏర్పాటు చేసుకొని కోడ్ లాంగ్వేజ్ రూపంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
మొదటగా ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మరో కాన్పు కోసం ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లింగ నిర్ధారణ కోసం ఒక రేటు ఆడపిల్ల అని తెలియగానే పురిటిలోనే ఆ బిడ్డను గర్భస్రావం జరిపేందుకు మరో రేటు నిర్ణయించి నిబంధనలకు విరుద్ధంగా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.
అందుకు లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు కూడా ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే గత ఏడాదికాలంగా బాలికల నిష్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోందని విద్యావేత్తలు వైద్యాధికారుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రతి వెయ్యి మందిలో 890 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు వైద్యాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ బాలిక నిష్పత్తి క్రమంగా తగ్గితే ఆడపిల్లలను మ్యూజియంలో మాత్రమే చూసుకునే పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గూడచారి వ్యవస్థ ద్వారా లింగ నిర్ధారణ
ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు లింగ నిర్ధారణ పరీక్షలు భ్రూణ హత్యలు జరిపేందుకు గూడచారి వ్యవస్థ మాదిరి సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఒక్కో కేసులో సుమారు 50 నుండి లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైన అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాల్లో అధికంగా భ్రూణ హత్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జనరల్ ఆస్పత్రి చుట్టూరా ఆయా ప్రైవేట్ ఆసుపత్రి చెందిన ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను స్కానింగ్, లింగ నిర్ధారణ కోసం వచ్చేవారిని గుర్తించి ఆయా ఆసుపత్రికి తీసుకు వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
అక్రమ శారీరక సంబంధాలు, కుటుంబ నియంత్రణ పాటించని వారిలో వారిని బెదిరింపులకు పాల్పడి భృణ హత్యలు జరిపే క్రమంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 39 స్కానింగ్ సెంటర్లు అనుమతులు పొందినప్పటికీ అనుమతులు ఒకరి పేరుతో పొంది నిర్వహణ మాత్రం కిందిస్థాయి సిబ్బంది చేత జరపడంతో తప్పుడు రిపోర్టర్ల ద్వారా పుట్టబోయే బిడ్డ కూడా అనారోగ్యంతోనే కనిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.