calender_icon.png 9 January, 2026 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ మహిళల రక్షణకు జెండర్ రిసోర్స్ సెంటర్లు కీలకం

09-01-2026 12:20:37 AM

  1. జి.ఆర్.సి.లపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం 

డి.ఆర్.డి.ఓ. విద్యాచందన

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 8 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గృహహింస, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, సామాజికఆర్థిక సమస్యలకు గురైన ప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియక మౌనంగా భరించే పరిస్థితులను మార్చేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్లు (జి.ఆర్.సి.) కీలకంగా ఉపయోగపడతాయని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డి.ఆర్.డి.ఓ.)  విద్యాచందన  తెలిపారు.

జి.ఆర్.సి.ల అమలుపై అవగాహన కల్పించేందుకు గురువారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపియంలు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణను సెర్ఫ్ జెండర్ అడ్వైజర్, ట్రైనర్  జమున  నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి దశలో భద్రాచలం, మణుగూరు, సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి మండలాలకు జెండర్ రిసోర్స్ సెంటర్లు మంజూరయ్యాయని డి.ఆర్.డి.ఓ. తెలిపారు.

ఈ సెంటర్ల ద్వారా మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడంతో పాటు, కుటుంబ వేధింపులు, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళా హక్కులు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించడం, మానసిక ఒత్తిడికి గురైన బాధితులకు నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ సేవలు అందించడం జరుగుతుందని వివరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ, మండల సమాఖ్య సంఘాల్లోని సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ముగ్గురు, మండల స్థాయిలో ఐదుగురు చొప్పున సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు. ఈ కమిటీ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్ల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు.

జెండర్ రిసోర్స్ సెంటర్లలో ప్రతిరోజూ మహిళల సమస్యలను విని పరిష్కార మార్గాలు సూచిస్తారని, ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఆర్సీ కేంద్రాల్లో కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అదేవిధంగా జీఆర్సీ కేంద్రాల వద్ద ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డ్వాక్రా మహిళలు లింగ వివక్ష, లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సందర్భాల్లో ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

సామాజిక కార్యాచరణ కమిటీ సభ్యులు మహిళల సమస్యలను సానుభూతితో విని అవసరమైన సూచనలు, సలహాలు అందించడంతో పాటు, అర్హులైన మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చురుకైన పాత్ర పోషిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డి.పి.ఓ.  బి. అనూష , జెండర్ ట్రైనర్  జమున , సెర్ఫ్ జెండర్ డి.పి.యం. లింగయ్య గౌడ్ , డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్  రూప , మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఏపియంలు మరియు డి.ఆర్.డి.ఏ. హెచ్.డి. విభాగం సిబ్బంది పాల్గొన్నారు.