calender_icon.png 10 September, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి పన్ను ఎగవేతకు జీహెచ్‌ఎంసీ చెక్

10-09-2025 01:20:20 AM

  1. విద్యుత్ కనెక్షన్లతో జీహెచ్‌ఎంసీ డ్రిల్
  2. పీటీఐఎన్-యూఎస్‌సీ నంబర్ల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి
  3. భారీగా పెరగనున్న బల్దియా ఆదాయం
  4. ప్రకటనల అనుమతులు ఇకపై కేవలం ఆన్‌లైన్‌లోనే
  5. అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఆస్తి పన్ను ఎగవేతదారులకు ఉచ్చు బిగించేందుకు జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని ఆయుధంగా చేసుకుని, బల్దియా ఆదాయానికి పడుతున్న గండిని పూడ్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగు తోంది. ఇందులో భాగంగా, జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్యలను, విద్యుత్ కనెక్షన్ల  సంఖ్యలతో అనుసంధానించే బృహ త్తర కార్యక్రమాన్ని చేపట్టింది.

ఈ ప్రక్రియ ద్వారా నివాస భవనాలుగా పన్ను చెల్లిస్తూ, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వేలాది ఆస్తులను గుర్తించి, బల్దియా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లో ఐటీ, రెవెన్యూ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ అనురాగ్ జయంతి ఈ వివరాలను వెల్లడించారు.

కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మార్గదర్శకాల మేరకు టీజీఎస్పీడీసీఎల్, సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో 100శాతం డోర్ నంబర్లు సరిపోలిన కేసులను విశ్లేషించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ద్వారా జీహెఎంసీ ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నట్లు స్పష్టమైంది.

జోన్ల వారీగా గుర్తించిన ఆస్తులు

ఆరు జీహెచ్‌ఎంసీ జోన్ల పరిధిలో నివాస భవనాలుగా పన్ను చెల్లిస్తున్న  ఏకంగా 96,938 ఆస్తులు, వాణిజ్య అవసరాలకు విద్యుత్ కనెక్షన్లు నాన్-రెసిడెన్షియల్  కలిగి ఉన్నట్లు తేలింది. చార్మినార్‌లో 26,056, ఖైరతాబాద్ సికింద్రాబాద్ 22,005, ఎల్‌బినగర్ 9,761, శేరిలింగంపల్లి కూకట్‌పల్లి ఆస్తులను గుర్తించారు.

రెండో దశలో 80 వరకు డోర్ నంబర్, పేరు సరిపోలిన మరో 22,169 రికార్డులను కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ డేటా అనుసంధానం ద్వారా ఆస్తి పన్ను వసూళ్లు బలోపేతం కావడమే కాకుండా, ఆదాయ లీకేజీలను పూర్తిగా అరికట్టవచ్చని అదనపు కమిషనర్  అనురాగ్ జయంతి ధీమా వ్యక్తం చేశారు. 

ప్రకటనల అనుమతులు ఇకపై ఆన్‌లైన్‌లోనే

ఇదే సమావేశంలో ప్రకటనల విభాగంలో పారదర్శకతను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఆదేశాల మేరకు, ఇకపై ప్రకటనల అనుమతుల కోసం దరఖాస్తులను కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించాలని,

ఆఫ్‌లైన్ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్  రాధ, డిప్యూటీ కమిషనర్  పద్మ, ఏఈలు నవీన్, మలన్, బెలువా, భార్గవి, తిరుమల్, అభిలాష్, కార్తీక్, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.