07-10-2025 01:33:19 AM
-చౌటుప్పల్ సమీపంలోని చల్లూరులో 220 ఎకరాల్లో బృహత్ వెంచర్
-గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవ
హైదరాబాద్ సిటీ బ్యూరో,అక్టోబర్ 6 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ పర్మనెంట్ ఉద్యోగులకు గ్రేటర్ హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ శుభవార్త అందించింది. సొంత ఇల్లు లేని ఉద్యోగుల కలను సాకారం చేసే లక్ష్యంతో, అత్యంత తక్కువ ధరకే నివాస స్థలాలను అందించేందుకు జీహెఎంసీ కాలనీ పేరుతో బృహత్ వెంచర్‌కు శ్రీకారం చుట్టినట్లు యూనియన్ అధ్యక్షుడు గోపాల్ సోమవారం పేర్కొన్నారు.
ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగుల మాదిరిగానే మనకంటూ ఒక ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాం అని అన్నారు. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ సమీపంలోని చల్లూరు వద్ద 220 ఎకరాల విశాలమైన భూమిని యూనియన్ కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ వెంచర్‌లో ప్లాట్లను మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా, గజం రూ.3,999/- నామమాత్రపు ధరకే పర్మినెంట్ ఉద్యోగులకు, తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేటా యించనున్నాం.
ఇప్పటికే డీటీసీపీ అనుమతుల కోసం దరఖాస్తు చేశాం, పనులు వేగం గా జరుగుతున్నాయని గోపాల్ వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే జీహెఎంసీ పర్మినెంట్ ఉద్యోగులు, రూపాయి చెల్లించి యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం తీసుకుంటే వెంచర్ స్థలాన్ని సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.