14-12-2025 12:29:52 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ భారీ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. లంగర్ హౌస్ పోలీసుల తో కలిసి నిర్వహించిన పకడ్బందీ ఆపరేషన్‌లో ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి అత్యంత ప్రమాదకరమైన, విలువైన 5 కిలోల హ్యాష్ ఆయిల్, 5 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ మీడియా కు వివరాలు వెల్లడించారు. ‘ఈ దందాకు ప్రధాన సూత్రధారి వైకుంఠరావు. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో డ్రగ్స్ వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఒడిశా రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి తక్కు వ ధరకు గంజాయిని, దాని నుంచి తీసిన హ్యాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్, రైళ్లు, ద్విచక్ర వాహనాల ద్వారా దీనిని హైదరాబాద్‌కు చేరవేస్తున్నాడు.
నగరానికి చేరిన సరుకును తన అనుచరుల ద్వారా చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. హ్యాష్ ఆయిల్ విలువ మార్కెట్‌లో లక్షల్లో ఉంటుంది’ అని డీసీపీ వైభవ్ తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వైకుంఠరావు ముఠా కేవలం విక్రయించడమే కాదు, నగరంలో ఒక బలమైన వినియోగదారుల నెట్వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడు.
నిందితుల ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్ ఆధారంగా.. వీరి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న దాదాపు 100 మంది కన్జ్యూమర్లను పోలీసులు గుర్తించారు. వీరిలో విద్యార్థులు, యువకులు, ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితా ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.