calender_icon.png 18 August, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత భవనాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి

18-08-2025 12:00:00 AM

  1. బేగంబజార్ ఘటనతో రంగంలోకి
  2.   685 శిథిల భవనాల గుర్తింపు
  3.   358 భవనాలకు ఖాళీ చేయాలని నోటీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 17 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని శిథిలావస్థకు చేరిన భవనాలపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. ఇటీవలే బేగం బజార్‌లో పాత భవనం కుప్పకూలిన ఘటనతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాత భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున రంగంలోకి దిగి శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలంటూ యజమానులకు నోటీసులు జారీ చేసింది.

ప్రమాదాలను నివారించే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా జీహెఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం నిర్వహించిన సర్వేలో మొత్తం 685 పాత, శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించారు. వీటిలో తక్షణమే మరమ్మతులు చేయగలిన 327 భవనాల పనులను యజమానులతో పూర్తి చేయించారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న మిగిలిన 358 భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి, తక్షణమే భవనాలను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఆ మూడు జోన్లపై ప్రత్యేక దృష్టి

జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో శిథిల భవనాల అంశంపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్ల పరిధిలో అత్యధికంగా పెండింగ్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ జోన్ల అధికారులకు తక్షణమే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, ప్రమాద కర భవనాలను గుర్తించి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పరిస్థితి తీవ్రత ను వివరించాలని, వారు సహకరించని పక్షంలో బలవంతంగానైనా భవనాలను ఖాళీ చేయించి, వాటిని సీల్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పాతబస్తీ, గోషామహల్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో పురాతన కట్టడాలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 

గతేడాది 566 భవనాల గుర్తింపు

గత సంవత్సరం వర్షాకాలంలో జీహెఎంసీ 566 శిథిల భవనాలను గుర్తించింది. వాటిలో 89 భవనాలను పూర్తిగా కూల్చివేయగా, 146 భవనాలకు మరమ్మతులు చేయించడం లేదా సీల్ వేయడం జరిగింది. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు 685 భవ నాలను గుర్తించినప్పటికీ, కూల్చివేతలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి మరమ్మతులు, భవనాలను ఖాళీ చేయిం చడంపైనే అధికారులు ప్రధానంగా దృ ష్టి సారించారు. అవసరాన్ని బట్టి, యజమానులు స్పందించని పక్షంలో కూల్చి వేతలు కూడా చేపట్టే అవకాశం ఉంది.

సెల్లార్ల తవ్వకాలపైనా నిషేధం

పాత భవనాలతో పాటు, వర్షాకాలంలో సెల్లార్ల తవ్వకాల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని జీహెఎంసీ భావిస్తోంది. ఈ కారణంగా,  వర్షాకాలం ముగిసే వరకు కొత్తగా సెల్లార్ల తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని నిర్ణయిం చింది. నగరంలో ఇప్పటికే పనులు జరుగుతున్న 154 సెల్లార్ సైట్లలో, 61 చోట్ల భద్రతా చర్యలు పూర్తి చేశారు. మిగిలిన చోట్ల పనులు జరుగుతున్నాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.