17-08-2025 10:49:34 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): వేమనపల్లి మండలంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వేమనపల్లి మండలం లోని సంపుటం గ్రామానికి చెందిన భార్యాభర్తల గొడవ విషయంలో భర్త ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ పేరుతో తీవ్రంగా చితకబాదాడు. బాధితుని వద్ద నుండి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలో వినిపించాయి.
ఎస్సై సురేష్ చేతిలో తీవ్ర గాయాల పాలైన బాధితుడు అల్గం కిష్టయ్య తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ సమగ్రమైన విచారణ జరిపించి బాధ్యుడని తేలడంతో ఎస్సై సురేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన ఎస్సై సురేష్ గత నెల 19న నీల్వాయి పోలీస్ స్టేషన్ లో విధుల్లో చేరారు. కనీసం నెల రోజులు కూడా పూర్తికాకుండానే బాధితున్ని చితకబాదిన సంఘటనలో సస్పెండ్ కావడం ప్రస్తుతం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో చర్చనీయాంశంగా మారింది.