15-08-2025 01:32:16 AM
రోడ్డుపై అక్రమ వాహన నిలుపుదలతో 500 మీటర్ల ట్రాఫిక్ జామ్
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
శేరిలింగంపల్లి, ఆగస్ట్ 14 : శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న ఓక్రిడ్జ్ అంతర్జాతీయ పాఠశాల నిర్వహణపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెఎంసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. పాఠశాల వాహనాలను ప్రభుత్వ రోడ్డుపై అక్రమంగా నిలిపివేయడం వల్ల సుమారు 500 మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి, ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించినట్లు అధికారులు గుర్తించారు.
జీహెఎంసీ చట్టం 1955 సెక్షన్ 405, టీజీ-బీపాస్ చట్టం 2020 నిబంధనలకు ఇది విరుద్ధమని స్పష్టంచేసిన జీహెఎంసీ, దీనిని ప్రభుత్వ భూమిపై అనధికార ఆక్రమణగా పరిగణించింది. వెంటనే వాహనాలను తొలగించి, ఇకపై రోడ్డుపై వాహన నిలుపుదల చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ సమర్పించకపోతే వాహనాలను ఈడ్చివెళ్లి స్వాధీనం చేసుకోవడం, జరిమానాలు విధించడం, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది. ప్రజా ప్రయోజనం దృష్ట్యా, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఈ చర్య చేపట్టినట్లు సర్కిల్-20 ఉప కమిషనర్ తెలిపారు.