calender_icon.png 4 October, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి..

04-10-2025 05:02:26 PM

సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్..

గద్వాల (విజయక్రాంతి): సమాజంలో ఆర్థికంగా, గౌరవప్రదంగా ఎదిగేందుకు అమ్మాయిలు ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అన్నారు. సెర్ప్, యూనిసెఫ్ ఆధ్వర్యంలో శనివారం గద్వాల వజ్రా అభినందన్ బ్యాంకేట్ హాల్లో స్నేహ(సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడల్సేంట్ గర్ల్స్) సంఘాల కిషోర్ బాలికలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విద్యాపరంగా, ఆర్థికంగా వెనకబడ్డ జోగులాంబ గద్వాల జిల్లాలో స్నేహ సంఘాలు బాలికల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాయని అన్నారు. బాల్య వివాహల నిర్మూలనకు ఇప్పటికే ఎంవిఎఫ్ ఫౌండేషన్ కృషి చేస్తుండగా ప్రస్తుతం యూనిసెఫ్ సహకారంతో కిషోర్ బాలికల సాధికారతకు ముందుకెళ్లడం జరుగుతుందన్నారు.

చదువు మానేసిన బాలికలు తిరిగి విద్యను అభ్యసించేందుకు ఓపెన్ టెన్త్, ఇంటర్ చదివేలా ప్రోత్సహించాలన్నారు. బాలికల సమస్యలు గుర్తించడంలో ఆయా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తోడ్పాటు అందించాలన్నారు. స్నేహ సంఘాలు మన రాష్ట్రానికే కాక యావత్ దేశానికి రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) నర్సింగరావు మాట్లాడుతూ స్నేహ సంఘాల సభ్యులు తమకు ఏ సమస్య ఉన్న సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. స్నేహ సంఘాల ద్వారా ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు లేనివారికి ఇప్పించడమే కాక బ్యాంకు ఖాతాలు సైతం ఓపెన్ చేయించడం జరుగుతుందన్నారు.

జిల్లాలో 8,000 మందికి పైగా బాలికలు సంఘాల్లో ఉన్నారని, ఇంకా సుమారు 15 వేల మంది బాలికలు సంఘాల్లో చేరాల్సి ఉందని తెలిపారు. చదువుతో పాటు ఆరోగ్యంపై దృష్టి సాధించినప్పుడే అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు బాలికలు వివిధ అంశాలపై ఆటపాటలు, నాటికలతో అలరించారు. సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధులు మురళీకృష్ణ, మేరీ జోన్స్, ఇన్చార్జి డిఇఓ విజయలక్ష్మి, డిఆర్డిఏ ఏపీడి శ్రీనివాస్, డిప్యూటీ డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ప్రభావతి, డిఆర్డిఏ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.