10-09-2024 05:04:35 AM
దిశ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు విచారణలో భాగంగా జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ సింగిల్ జడ్జి వద్ద పెండింగ్లో ఉన్న పిటిషన్ల వివరాలను సమర్పించాలంటూ ప్రతివాదులైన పోలీసులకు సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందు కోసం ఈ నెల 30 వరకు గడువు ఇస్తూ విచారణను వాయిదావేసింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసులపై కేసు నమోదు చేయాలన్న పిల్‌తోపాటు పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను చేపట్టింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్‌ఎన్ హేమేంద్రనాథ్‌రెడ్డి వాదనలు ప్రారంభిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ విచారణ జరిపి నివేదిక సమర్పించిందన్నారు. ఈ నివేదిక ఆధారంగానే పోలీసు కేసు నమోదుతోపాటు ప్రస్తుత కేసులో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు.
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక చట్టబద్ధతను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు దాఖలు చేశామని తెలిపారు. ఒకవేళ సింగిల్ జడ్జి తమ పిటిషన్లను అనుమతించిన పక్షంలో సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ప్రశ్నార్థకం అవుతుందని, దాని ఆధారంగా ఇక్కడ చేసిన వాదనలకు ప్రయోజనం లేదన్నారు. అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరగా ధర్మాసనం స్పందిస్తూ పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.