calender_icon.png 18 November, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు ఊరట

10-09-2024 05:02:39 AM

  1. పెరిగిన సీట్లకు మాప్‌అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలి 
  2. ఈ అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడే ఉంటాయి 
  3. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): వివిధ కోర్సుల్లో పెరిగిన సీట్లు భర్తీ చేసుకునే వ్యవహారంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో సీఎస్సీలో సీట్ల పెంపునకు ఏఐసీటీఈ ఆమోదించినా, జేఎన్టీయూ ఎన్వోసీ జారీ చేసిన సీట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతించాలని, ఆ సీట్ల భర్తీకి మాపప్ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పెరిగిన సీట్లను మాప్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని, దీని ద్వారా విద్యార్థులు పొందిన అడ్మిషన్లు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. కొత్త కోర్సుల ప్రారంభం, సీఎస్సీలో సీట్ల పెంపునకు అనుమతి నిరాకరిస్తూ ఆగస్టు 24న జారీచేసిన మెమోను సవాల్ చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీతోపాలు పలు కాలేజీలు వేర్వేరుగా 11 పిటిషన్లు దాఖలు చేశాయి.

వీటిపై విచారించిన సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డ్డి, పీ శ్రీరఘురాం, ఎస్ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 70 విద్యా సంస్థలు సీట్ల పెంపునకు అనుమతి కోరగా 56 సంస్థలకు అనుమతిస్తూ తమకు మాత్రమే నిరాకరించారని చెప్పారు. కేవలం రాజకీయ కారణాల వల్లనే అనుమతులు నిరాకరించారని తెలిపారు.

అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ వాదన అవాస్తవమని, రాజకీయ ఉద్దేశాలు ఏమీలేవన్నారు. ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన కాలేజీలకు గత పదేళ్లలో సీట్ల పెంపునకు అనుమతి లభించలేదన్నారు. పిటిషనర్లకు మాత్రం ఏటా పెంపునకు అనుమతిస్తూనే వస్తున్నారని చెప్పారు. కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తు తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పటికే మంజూరైన కంప్యూటర్ సైన్స్ కోర్సులోని సీట్లు మిగిలిపోయి ఉన్నాయని అన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం పెరిగిన కోర్సులకు కాలేజీలు గత మార్చిలోనే జేఎన్టీయూ నుంచి ఎన్వోసీ తీసుకుందని, మౌలిక వసతులకు సంబంధించిన ఆరోపణలు లేవంది.

అనుమతులను నిరాకరించడానికి ప్రభుత్వ విధానాలకు సంబంధించిన వివరాలు రికార్డుల్లో లేవని పేర్కొంది. అడ్మిషన్ల వ్యవహారంలో కాలేజీల పొరపాటు ఏమీ కనిపించడంలేదంది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీచేయని పక్షంలో తరువాత కాలేజీలకు అనుకూలంగా ఉత్తర్వులు జారీచేసినా ప్రయోజనం ఉండదని చెప్పింది. అందువల్ల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ పెంచిన సీట్ల భర్తీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సీట్ల భర్తీకి మాప్‌అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలంది. ఈ పిటిషన్లోని పూర్వాపరాల్లోకి కోర్టు వెళ్లలేదని స్పష్టంచేస్తూ పూర్తి వివరాలతో సింగిల్ జడ్జి వద్ద 2 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని సింగిల్ జడ్జికి సూచిస్తూ అప్పీళ్లపై విచారణను మూసివేసింది.