25-11-2025 12:00:00 AM
రాహుల్‌గాంధీ మాటలకు విలువివ్వరా?
తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కుల గణన జరిపి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తామన్న రాహుల్‌గాంధీ ఆలోచనా విధానాన్ని తెలంగాణలోని సొంత పార్టీ నేతలే బేఖాతరు చేస్తున్నారని, రాహుల్ మాటలకు విలువ ఇవ్వరా అని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ప్రశ్నించారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ.. కేవలం 26 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను రద్దు చేయాలని, ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి బీసీలు దూరమవడం ఖాయమని హెచ్చరించారు.
ప్రభుత్వం జీవో 46తో బీసీలకు అన్యాయం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు పెదవి విప్పడం లేదని, వారి మాట పార్టీలో చెల్లుబాటు కావడం లేదా లేక పదవుల కోసం బీసీల ప్రయోజనాలను తాకట్టు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీ కేవలం ఓట్లు దండుకోవడానికేనా అని రామకృష్ణ మండిపడ్డారు.
ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే, కాంగ్రెస్‌ను బీసీ వ్యతిరేక పార్టీగా చూడాల్సి వస్తుంది, అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కులగణన లెక్కలను వెంటనే బయటపెట్టాలని, రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసు కెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇండియా కూటమికి 200 మందికి పైగా ఎంపీలు ఉన్నా, వారెవరూ పార్లమెంటులో బీసీల గొంతుకను వినిపించడం లేదన్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలను ఈ అంశంపై స్తంభింపజేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రామకృష్ణ సవాల్ విసిరారు.