25-11-2025 12:00:00 AM
ముషీరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను రిజర్వేషన్లను 42 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. జీవో నంబర్ 46 కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, గ్రామాల్లో నిరాహార దీక్షలు, రహదారుల దిగ్బంధం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
వారికి వినతి పత్రాలను సమర్పిస్తామని అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ చేసి ఆధ్వర్యంలో 130 బీసీ కుల సంఘాలు, 45 బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలతో సమావేశం బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ అన్ని పార్టీలతో త్వరలో చర్చించి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఆమరణ నిరాహార దీక్ష, రాష్ట్ర బందును నిర్వహించే విధంగా తగు నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనరల్ గ్రామపంచాయతీలలో బీసీలకు చెందిన వారిని పోటీ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46 తో రాష్ట్రంలో రెండు కోట్ల మంది బీసీలను మోసం చేయడం, దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు. గతంలో రెండు నెలల క్రితం 42 శాతం పెంచుతూ జీవో నెంబర్ 9ని జారీ చేశారని గుర్తు చేశారు.
ఈ కేసు హైకోర్టులో నడుస్తుందని, బీసీ వాదనలు వినిపించాలని కేసు నడుస్తుంటే తీర్పురాకముందే తగ్గిస్తూ జీవో నెంబర్ 46 ఎలా జారీ చేస్తార ని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 46 జీవోను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని ఆయన హెచ్చరిం చారు. సినీ డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల విషయంలో కుట్రలే వేగంగా ప్రయాణిస్తున్నాయన్నారు. బీసీలకు రావాల్సిన అమృతం అగ్రవర్ణాలే తాగేస్తున్నారని మండిపడ్డారు.
పెన్నులపై మన్ను కప్పితే గన్ను లై కదులుతాయని, అదే విధంగా బీసీలపై మన్ను కప్పితే గలమై మొలకెత్తుతారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చేంతవరకు బీసీలు ఐక్యంగా ఉండి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు బీసీలను అనగ తొక్కాలని ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కో-ఆర్డినేటర్ రిషి అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.