calender_icon.png 13 January, 2026 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో ఘనంగా గోదావరి హారతి

12-01-2026 12:29:12 AM

భద్రాచలం, జనవరి 11, (విజయక్రాంతి):  పంచభూతాల్లో ముఖ్యమైనది గంగా మాత అని ప్రతి మనిషికి నీరు అనేది చాలా అవసరమని భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి కొలువై ఉన్న ప్రదేశంలోని గోదావరి కరకట్టల పక్కన సాంప్రదాయం ఉట్టిపడేలా గోదావరి హారతి నిర్వహించడం వలన గోదావరి నది ప్రాముఖ్యత ప్రజల్లో అవగాహన పెంపొందించి నది సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని చేసి భక్తి భావం పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 

ఆదివారం నాడు భద్రాచలంలోని గోదావరి కరకట్టల దగ్గర ది రివర్ ఫెస్టివల్ లో భాగంగా ఏర్పాటుచేసిన నదీ హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పూజా కార్యక్రమాలను తిలకించిన అనంతరం నదిహారతి జ్యోతి వెలిగించి అర్చకుల దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులలో భక్తి భావం మరియు స్థానిక సాంప్రదాయాల పరిరక్షణ దృష్ట్యా భక్తులలో ఆధ్యాత్మికత పెంపొందించి నదీ సంరక్షణలో భాగస్వామ్యం చేయడానికి, శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోవడానికి వేరే రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున ప్రతి ఆదివారం గోదావరి అమ్మ నదిహారతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

గత నెల 27వ తారీఖు నాడు ప్రారంభించిన ఈ కార్యక్రమానికి దేవస్థానం అర్చక స్వాములు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగు తుందని, ఇంకా భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించాలని అన్నారు. అనంతరం నదిహారతి కార్యక్రమం తిలకించడానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడానికి వెయ్యి రూపాయలు అర్చక స్వాములకు జిల్లా కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, సిఎస్‌ఆర్ సమ్మేట్ డైరెక్టర్ సుమంత్, అర్చక స్వాములు రవికుమార్, వజ్జల రవి భక్తులు తదితరులు పాల్గొన్నారు.