calender_icon.png 13 January, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ ముఠా సైబర్ దోపిడీ @ రూ. 547.00 కోట్లు

12-01-2026 12:28:18 AM

ఖమ్మం, జనవరి 11 (విజయ క్రాంతి): సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి వారి ముఠా దోపిడీ చేసిన నగదు మొత్తం రూ. 547.00 కోట్లుగా ఖమ్మం జిల్లా పోలీసులు తేల్చారు. ఈ ముఠా సైబర్ దోపిడీకి సహకరించిన మొత్తం 18 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

సీపీ సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన మోదుగ సాయికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు.నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన పేరుతో వలవిసిరి ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రకాష్, మేడా సతీష్, మోరంపూడి చెన్నకేశవ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా రూ. 547.00 కోట్ల భారీ మొత్తాన్ని కొల్లగొట్టారని గుర్తించామన్నారు.

కేసు విచారణలో భాగంగా నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి, పోట్రు మనోజ్ కళ్యాణ్ ల కుటుంబ సభ్యుల, అనుచరుల బ్యాంక్ అకౌంట్లను పోలీసులు పరిశీలించగా దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. పోట్రు మనోజ్ కళ్యాణ్ బ్యాంకు ఖాతాలో రూ. 114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 45.62 కోట్లు, మనోజ్ కళ్యాణ్ బామ్మర్ది అయినటువంటి మేడా సతీష్ ఖాతాలో రూ. 135.48 కోట్లు, బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ. 81.72 కోట్లు, కరీంనగర్ కు చెందిన తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందిన నరసింహా కిరాణం అండ్ డెయిరీ ఖాాతాలో రూ. 92.54 కోట్లు, ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ. 80.41 కోట్ల చొప్పున లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

సత్తుపల్లి పరిసర గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులను ఉద్యోగాల కల్పన పేరుతో పిలిపించుకుని, వారికి ఉద్యోగం ఇచ్చి, వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాను తెరిపించి, ఆయా అకౌంట్లలో క్రెడెన్షియల్స్ ను తీసుకుని నిందితులు కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ నేరాల సొత్తును జమ చేయడానికి వినియోగించారు. ఈ నేరస్తులు అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్థులతో జతకట్టి విదేశాలలో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ వాటి ద్వారా దేశంలోని పౌరులకు పెట్టుబడి, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు మరియు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో మోసగించి, ఎవరైనా బాధితుడు వారి మాటలకు ఆకర్షించబడితే అతనిని వారి టెలిగ్రామ్ గ్రూపులలో సభ్యునిగా చేర్చి, తర్వాత వారికి మోసపూరిత లింకులు పంపి వారి అకౌంట్లో నుండి డబ్బులను ఖాళీ చేయడం జరుగుతుంది.

వీరు మొదట సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన నేరపు సొత్తును, వీరి ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ అకౌంట్లోకి బదిలాయించేవారు. తర్వాత ఇట్టి సొమ్మును కొన్ని కరెంట్ ఎకౌంట్లోకి మార్చి, చివరగా తమ పర్సనల్ ఎకౌంట్లోకి అట్టి డబ్బులు చేర్చి, యు ఎస్ డాలర్,  మరియు క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చినట్టుగా తేలినది. ఇట్టి కేసు విచారణలో భాగంగా మొదట పోట్రు ప్రవీణ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడం జరిగినది. అలాగే నిందితుల బ్యాంక్ అకౌంట్లో సహాయంతో వారికి ఎకౌంట్లు ఇచ్చి సహకరించిన పలువురు వ్యక్తులను మరియు అకౌంట్స్ ను  గుర్తించడం జరుగుతున్నది.

క్షేత్రస్థాయిలో కేసు దర్యాప్తు కొనసాగుతుందని నిందితులేవరిని ఉపేక్షించేది లేదని చట్టపకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ళ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని అత్యాశకుపోయి కేసుల్లో ఇరుకోవద్దని సూచించారు. ఈ సైబర్ నేరాల రాకెట్ లో నిందితులకు సహకరించినందుకుగాను సదాశివపాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన జుంజునూరి శివక్రిష్ణ, వడ్లమూడి నరేంద్రమల్లాది శివ, సాధు పవన సందీప్, సాదు సంధ్య, సాధు లేఖలను అరెస్ట్ చేశారు. అదేవిధంగా లింగపాలెం గ్రామానికి చెందిన జొన్నాదుల తిరుమల, కందుకూరి మణికంఠ, తన్నీరు మహేష్, గోళ్లమూడి నాగముఖేష్, కంచపోగు శ్రీనివాస్, రాయల అజయ్ కుమార్, రాయల గోపి, పల్లా గణేష్, రాయల గోపిచంద్, కందుకూరి జగదీష్, కరీంగనర్ కు చెందిన తాటికొండ రాజులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోట్రు ప్రవీణ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీపీ సునీల్ దత్ వివరించారు.