12-01-2026 12:29:14 AM
కట్టంగూరు, జనవరి 11 : ప్రసవ నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది ఆపద్బాంధవులయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే నొప్పులు తీవ్రమవడంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె ఇంటివద్దే సుఖప్రసవం చేశారు. కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామానికి చెందిన గద్దపాటి వెంకన్న భార్య ముస్కు ధనలక్ష్మి (24)కు రెండో కాన్పు నిమిత్తం పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. శాలిగౌరారం నుంచి వచ్చిన అంబులెన్స్ చేరుకునే సరికి ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రసవం జరిగే అవకాశం ఉందని గుర్తించిన వైద్య సహాయకుడు రమేష్, వాహన చోదకుడు యాదగిరి ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంట్లోనే సుఖప్రసవం చేయించారు. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన వైద్యం కోసం నల్లగొండ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అత్యవసర సమయంలో ధైర్యంగా వ్యవహరించిన 108 సిబ్బందిని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.