calender_icon.png 30 August, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బాసర

30-08-2025 12:15:09 PM

హైదరాబాద్: బాసర అమ్మవారి ఆలయం(Gnana Saraswati Temple) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి(Godavari flood) నుంచి ఆలయం వరకు ప్రధాన రహదారి జలమయమైంది. ఆలయం వద్ద దుకాణాలు, ప్రైవేటు లాడ్జీలు, సత్రాలు నీటమునిగాయి. అక్షర కాలనీ, టెంపుల్ కమాన్ రోడ్డు, ఎస్బీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంకులు జలమయం అయ్యాయి. అక్షర కాలనీలో చిక్కుకున్న వారిని ట్రాక్టర్ లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

వరదల వల్ల బాసర ఆలయం వద్ద దుకాణాలు నీటమునగడంతో దుకాణాల్లోని సరుకులు, సామాగ్రిని దుకాణదారులు తరలిస్తున్నారు. నడుములోతు నీళ్లలో సామగ్రిని తరలిస్తున్నారు. బాసర ఆలయం వద్ద వరద నీరు విద్యాలయాన్ని చుట్టుముట్టింది. నాగభూషణ్ విద్యాలయంలో(Sri Nagabhushana Vidyalayam) 30 మంది విద్యార్థులు, ఆరుగురు టీచర్లు వరద నీటిలో చిక్కుకున్నారు. వరద చుట్టుముట్టడంతో విద్యార్థులు, టీచర్లు భవనం పైఅంతస్తుకు వెళ్లారు. విద్యార్థులను బయటకు తీసుకురావడానికి 8 మంది గ్రామస్థులు ట్రాక్టర్లతో వెళ్లారు. విద్యార్థులను బయటకు తీసుకురావడానికి వెళ్లిన వారు వరదల్లో చిక్కుకున్నారు.

బాసర ఆలయ పరిసరాలు నీటమునక

బాసర ఆలయ సమీప ఆర్యవైశ్య సత్రంలో వరద నీటిలో గర్భిణీ చిక్కుకుందిగర్భిణీని కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు ప్రయత్నించారు. ఓ ఇంట్లో చిక్కుకున్న కుటుంబాన్ని ఎస్డీఆర్ఎఫ్ బృందం బయటకు తీసుకువచ్చింది. ఎగువన భారీ వర్షాలకు గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో స్నానఘట్టం వద్ద గోదావరి గంగామాత విగ్రహ పాదాలను తాకింది. స్నానఘట్టం వద్ద సూర్యేశ్వర ఆలయం, గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మార్గం జలదిగ్బంధం అయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.