08-07-2025 09:37:54 PM
ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలకు 35 మంది విద్యార్థులు..
లింగాపూర్ ఎంపీపీఎస్ ఆదర్శనీయం..
తల్లిదండ్రుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
తిమ్మాపూర్ (విజయక్రాంతి): అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేట్ పాఠశాలల నుండి 35 మంది విద్యార్థులు లింగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చేరడం ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(District Collector Pamela Satpathy) అన్నారు. మానకొండూరు మండలం లింగాపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశానికి పేరెంట్స్ కచ్చితంగా హాజరుకావాలని అన్నారు.
అప్పుడే పిల్లల చదువు తీరును తెలుసుకోవచ్చని, ఉపాధ్యాయులతో మాట్లాడి మరింత మెరుగుపరచవచ్చని అన్నారు. ఐదవ తరగతి లోపు విద్యార్థుల పట్ల అత్యంత శ్రద్ధ అవసరమని, ప్రభుత్వ పాఠశాలలో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లింగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు వివిధ ప్రైవేటు పాఠశాలల నుండి 35 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో చేరడం గొప్ప విషయం అన్నారు. ఇందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ గ్రామంలో ఐదేళ్లు నిండిన అంగన్వాడి చిన్నారులు మొత్తం మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరడం, ఏడవ తరగతి పూర్తి చేసిన నూరు శాతం విద్యార్థులు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరడం పట్ల కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసే వాట్సాప్ గ్రూపులు, యూట్యూబ్ ఛానల్ ద్వారా తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా విధానాన్ని తెలుసుకోవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. రెండవ తరగతి విద్యార్థినిని ఒడిలో కూర్చుండబెట్టుకొని న్యూస్ పేపర్ చదివించారు. పలువురు విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకున్న అంశాలను కలెక్టర్ కు వివరించారు. అనంతరం తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తీసుకున్న చర్యల పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈఓ మధుసూదన్, తహసిల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో వరలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ జియ్యంగార్, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పరిశీలన
మానకొండూరు మండలం లింగపూర్ లో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. లబ్దిదారు తాళ్ల భాగ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్మాణంలో ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం వేగంగా పూర్తి చేసుకోవాలని, దశలవారీగా సొమ్ము జమ చేయిస్తామని అన్నారు. లబ్ధిదారు ఇల్లు బేస్మెంట్ లెవెల్ పూర్తవుతున్నందున లక్ష రూపాయలు జమ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వరలక్ష్మి, తహసిల్దార్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.