08-07-2025 09:38:24 PM
కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లో మంగళవారం గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. వివేకానంద చౌక్ నుండి కుబీర్ గ్రామం లోపలికి వచ్చే రోడ్డు గుంతలు ఏర్పడి పూర్తిగా చెడిపోవడంతో వాహనాలతో పాటు కాలినడకన వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ రోడ్డు గుండా వెళ్ళేది వ్యవసాయ రైతులు, పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఫలితం కానరాకపోవడంతో గ్రామస్తులు మంగళవారం మూకుమ్మడిగా రోడ్డు ఎక్కారు. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. విషయం తెలుసుకున్న కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి(SI Krishna Reddy) అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సందాయించే ప్రయత్నం చేశారు.
ప్రజలు ఆందోళన విరమింప చేయకపోవడంతో ఎస్సై బజార్ రూరల్ సీఐ నైలు నాయక్ సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆయన ఆందోళనకారులను సముదాయించారు. డోడర్న రింగ్ రోడ్డు పనులను చేస్తున్న కాంట్రాక్టర్ తో మాట్లాడి గుంతలలో మొరం, వెట్ మిక్స్ తో అక్కడికి చేరుకున్న టిప్పర్లను గుంతలలో ఖాళీ చేయించారు. దీంతో తాత్కాలికంగా సమస్యకు కొంత ఊరట లభించింది. దీంతో ఆందోళన కారులు తమ ఆందోళన విరమించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వివేకానంద చౌక్ నుంచి కుభీర్ గ్రామం లోపలికి వెళ్లే రోడ్డుకు నిధులు మంజూరు చేసి శాశ్వత మరమ్మతులు చేయించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగారోడ్డు గుండా వందలాది వాహనాలు ఆగిపోయి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బోయిడి విట్టల్, మాజీ ఎంపిటిసి వసంత నాయక్, బోయిడి అభిషేక్, గులాబ్ నాయక్, కే లక్ష్మణ్, గ్రామస్తులు, రైతుల పాల్గొన్నారు.