17-12-2025 12:30:41 AM
సన్మానించిన మంత్రి సీతక్క
వెంకటాపూర్(రామప్ప), డిసెంబర్16(విజయక్రాంతి):మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామానికి చెందిన గోగు శేషు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల మంగళవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సీతక్క ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా పేరును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా క్రీడాకారులు ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు.
క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాగా, ఈ నెల 25 నుంచి 27 వరకు కరీంనగర్ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో గోగు శేషు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ చైర్మన్ పైడాకుల అశోక్, అధ్యక్షుడు రవీందర్, కార్యదర్శి జనార్దన్, ఉపాధ్యక్షుడు కృష్ణ, జాయింట్ సెక్రటరీ వెంకటేష్, అసోసియేషన్ బాధ్యుడు రాజయ్య, నవీన్, సీనియర్ క్రీడాకారుడు సురేందర్ తదితరులు పాల్గొన్నారు.