31-01-2026 01:49:10 AM
వెండి రూ.30 వేలు, తులం పసిడి రూ.5వేలు దిగువకు
అంతర్జాతీయ మార్కెట్లలోనూ పడిపోతున్న రేట్లు
ఔన్సు బంగారం 5,189, వెండి 110 డాలర్లు
భౌగోళిక అనిశ్చితులు, డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితితోనే ఒడిదుడుకులు
న్యూఢిల్లీ, జనవరి 30: అంతర్జాతీయ పరిస్థితుల రీత్యా కొంతకాలంగా చాలా వేగంగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు శుక్రవారం తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఉదయం 11.30 గంటల సమయంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,74,700 పలికింది. గురువారం రాత్రి ఈ ధర రూ.1,79,700 ఉన్నది. దీంతో శుక్రవారం దాదాపు రూ.5 వేల వరకు తగ్గింది. ఇక, వెండి ధర కూడా భారీగా పడిపోయింది. గురువారం రాత్రి హైదరాబాద్ మార్కెట్‌లో రూ.3,99,600 వద్ద ఉన్న కిలో వెండి ధర శుక్రవారం పొద్దనికల్లా రూ.3,70,000కు దిగొచ్చింది. అంటే.. సుమారు రూ.30వేల వరకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ వీటి ధరలు పడిపోతున్నాయి. ఔన్సు బంగారం 5,189 డాలర్లు, ఔన్సు వెండి 110 డాలర్లుగా ఉన్నాయి. అటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో మార్చి డెలివరీకి వెండి ప్యూచర్స్ ధర శుక్రవారం రూ.12,169 తగ్గి, రూ.3,87,724గా ఉంది. అమెరికా డాలర్ క్రమంగా కోలుకుంటోంది. దీంతో బంగారం, వెండి మదుపర్లు లాభాల ద్వారా స్వీకరణకు మొగ్గుచూపడం వల్ల ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పసిడి చరిత్రలో మొదటిసారి
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బంగారం మార్కెట్ విలువ గురువారం భారీకుదుపునకు లోనైందని స్టాక్ మార్కెట్ వ్యవహారాల కామెంటరీ వేదిక ‘ది కొబేసీ లెటర్’ ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్ అయ్యింది. ఈ పోస్టు ప్రకారం.. గురువారం ఉదయం 9.30 గంటల నుంచి 10.25 మధ్య (అమెరికా కాలమానం) పసిడి మార్కెట్ విలువ ఒక్కసారిగా 3.2 ట్రిలియన్ డాలర్ల మేర పడిపోయింది. అంటే నిమిషానికి 58 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.5 లక్షల కోట్లు) చొప్పున ఆవిరైంది.
ఆ తరువాత క్రమంగా కోలుకుని మార్కెట్స్ బందయ్యే సమయానికి కనిష్ఠ స్థితి నుంచి 2.3 ట్రిలియన్ డాలర్ల మేర ఎగబాకింది. అంటే.. ఒక్క సెషన్లోనే బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్చుతగ్గుల విలువ 5.5 ట్రిలియన్ డాలర్ల(లక్షల కోట్లు)ను చేరింది. అంటే నిమిషానికి 5.5లక్షల కోట్ల ఒడిదుడుకులకు లోనైంది. 2008 నాటి ఆర్థిక మాంద్యం సమయంలోనూ బంగారం ఈ స్థాయిలో ఊగిసలాడలేదని పేర్కొంది.
ఎందుకీ సడన్ మార్పులు?
బంగారానికి ఉన్న వాస్తవ డిమాండ్‌కు మించి ధరల్లో ప్రస్తుతం హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక అనిశ్చితులు, డాలర్ బలహీనత, అమెరికా వడ్డీ రేట్లపై అనిశ్చితి వంటి వాటితో పాటు ఇతర కీలక అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా వ్యవస్థాగత మదుపర్లు కమోడిటీ మార్కెట్స్‌పై దృష్టిపెట్టడం, కంప్యూటర్ ఆధారిత ట్రేడింగ్ పెరగడం, బంగారం హెచ్చుతగ్గుల ఆధారంగా డెరివేటివ్ మార్కెట్స్‌లో కూడా ట్రేడింగ్ అధికమ వడంతో పసిడి ధరలు అంచనాలకు మించి హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.ఇంత జరుగుతున్నా బంగారం ధరలకు ఈ ఏడాది బ్రేకులు ఉండకపోవచ్చని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది.