calender_icon.png 14 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలీసా హీలీ సంచలన నిర్ణయం

14-01-2026 01:16:02 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై

సిడ్నీ, జనవరి 13: ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నట్టు  ప్రకటించింది. భారత్‌తో జరగను న్న స్వదేశీ మల్టీ ఫార్మాట్ సిరీస్ తన కెరీర్‌కు  చివరి సిరీస్ అని వెల్లడించింది. 35 ఏళ్ల హీలీ ఈ విషయాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పింది. గత కొన్ని నెలలుగా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నానని, పోటీ తపన క్రమంగా తగ్గిపోతున్నట్లు అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హీలీ దాదా పు 300 మ్యాచ్‌లు ఆడింది.

మూడు ఫార్మాట్లలో కలిపి 7,000కి పైగా పరుగులు సాధించింది. వికెట్‌కీపర్‌గా 275 డిస్మిసల్స్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. మెగ్ లానింగ్ నాయకత్వంలో వైస్ కెప్టెన్‌గా సేవలందించిన హీలీ, 2023లో పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది. హీలీ కెరీర్లో ఎనిమిది ఐసీసీ వరల్డ్ కప్ విజయాలు ఉన్నాయి. మహిళల టీ20ల్లో వికెట్‌కీపర్‌గా అత్యధిక డిస్మిసల్స్, వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు వంటి రికార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలంలో హీలీ అన్సోల్డ్గా మిగలడం ఆమె రిటైర్మెంట్‌కు ఒక కారణంగా భావిస్తున్నారు.