24-09-2025 01:24:03 AM
కన్నీటి వీడ్కోలు పలికిన అభిమానులు, పౌరులు
గౌహతి సమీపంలో ముగిసిన అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ
గౌహతి, సెప్టెంబర్ 23: తమ అభిమాన గాయకుడు జుబీన్ గార్గ్(52)కు అంతిమ వీడ్కోలు పలికేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. ఆయన పార్థీవ దేహానికి మంగళవారం అస్సాంలోని గౌహతి నగరం సమీపంలోని సోనాపూర్‌లో రాష్ట్రప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. గార్గ్‌ను కడసారి చూసేందుకు వేలాదిగా అభిమానులు గౌహతి తరలివచ్చారు. తొలుత గార్డ్ భౌతికదేహాన్ని అదికా రులు గౌహతిలోని అర్జున్ భోగేశ్వర్ బారు వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అభిమానుల సందర్శనకు ఉంచారు.
అనంతరం సోనాపూర్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. అభిమానులు దారిపొడవునా ‘జుబీన్ అల్వీదా! అంటూ’ నినాదాలు చేశారు. గార్గ్ సోదరి పామ్ బోర్తాకూర్, సంగీతకారుడు రాహుల్ గౌతమ్ శర్మ చితికి నిప్పంటించారు. గార్గ్ చితి వద్ద ఆయన సతీమణి గరిమా సైకియా గుండెలవిసేలా రోదించారు. ఆమెను ఆపటం ఎవరి తరం కాలేదు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, కిరెన్ రిజిజు, పబిత్రా మార్గరీటా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.