26-11-2025 12:00:00 AM
బీఆర్‌ఎస్ అసత్య ప్రచారాలను నమ్మకండి
అలంపూర్, నవంబర్ 25: రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఆర్థిక సాయం అందుతూ ఉంటుందని నిరుపేదలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కోత్వాల్, వఫ్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. మంగళవారం గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సందర్భంగా ఒబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ... ముస్లిం మహిళల జీవనోపాధి కల్పించే దిశగా ఆలోచించి కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు.అసత్య ప్రచారాలతో పునాదులు వేసుకున్న బిఆర్‌ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోదన్నారు.
అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ... 200 యూనిట్ల ఉచిత కరెంటు అయితే నేమి, ఇందిరమ్మ ఇండ్లు ఉచిత గ్యాస్ సిలిండర్ ఉచిత బస్సు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పనిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెలికం అడ్వైజరీ కమిటీ మెంబర్ ఇస్మాయిల్, సిరాజ్, మొయినుద్దీన్, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.