23-12-2025 01:25:49 AM
చిట్యాల, డిసెంబర్ 22(విజయ క్రాంతి): సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర పాలకవర్గ సభ్యులు, అధికారులు సమన్వయంతో సమిష్టిగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
తన సొంత గ్రామమైన ఉరుమడ్ల గ్రామ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పాలకవర్గం పనిచేయాలన్నారు. గ్రామాలలో ఉండే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు చేయాలి తప్పా మిగతా సమయాల్లో రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.