09-09-2025 06:50:48 PM
లక్ష రూపాయల చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని తల్లిదండ్రులు
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): పేద విద్యార్థిని చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది, చదువు మధ్యలో ఆగిపోకుండా కళాశాలలో చెల్లించాల్సిన ఫీజు కోసం ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తంగళ్ళపల్లి మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడోజు ఆశ్రిత హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ మూడవ తరగతి చదువుతుంది. కళాశాలలో ఫీజు చెల్లించేందుకు కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఆర్థిక సహాయం చేయాలని హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించింది. స్పందించిన ప్రభుత్వం తగిన సహాయం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆశ్రిత తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఉన్నత విద్య అభ్యసించి, లక్ష్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. తమ కూతురు చదువుకు ఆర్థిక సహాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం, సహకరించిన జిల్లా కలెక్టర్ కు ఆశ్రిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.