ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు నాణ్యమైన సేవలకు ప్రతీకలుగా నిలవాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నపురెడ్డిపల్లి, మార్చ్, 24 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం లో గల ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే ఆదర్శ కేంద్రాలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం అన్నపురెడ్డిపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన, ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యా మరియు వైద్య సేవల అమలును సమగ్రంగా పరిశీలించారు.
మొదటగా ఎర్రగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మందుల గది, ప్రయోగశాల (ల్యాబ్), ఇన్పేషెంట్ విభాగం, స్టాక్ రిజిస్టర్, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అవుట్పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి, రోజువారీగా వచ్చే రోగుల సంఖ్యపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవుట్పేషెంట్ వార్డులో ఉన్న ఒక బాలుడితో మాట్లాడి, కుక్క కాటు టీకా కోసం వచ్చినట్లు తెలుసుకుని, టీకాలు అందుబాటులో ఉన్నాయా అని విచారించారు.
తనిఖీ సమయంలో మెడికల్ అధికారి అందుబాటులో లేకపోవడంతో కారణాలను ప్రశ్నించగా క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు, వెంటనే మెడికల్ అధికారిని పిలిచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది సిబ్బంది యూనిఫాం (ఆప్రాన్) ధరించకపోవడాన్ని గమనించి, విధి సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలిస్తూ, ఇటీవల జరిగిన ఇంగ్లీష్ పరీక్షపై విద్యార్థులను అడిగి తెలుసుకుని, రాబోయే గణిత పరీక్షకు క్రమబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని తనిఖీ చేశారు. మెనూలో ఉన్న కొన్ని పదార్థాలు లేకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకుని, వడ్డించిన ఆహారాన్ని తిని రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. కలెక్టర్ వెంట మెడికల్ అధికారి ప్రియాంక, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




