calender_icon.png 10 July, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక హాస్పిటల్ ఘటనపై సర్కార్ సీరియస్

05-06-2025 12:19:50 AM

- డైట్ కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్!

- ఆర్‌ఎంవో సస్పెన్షన్, డైట్ కాంట్రాక్టర్ తొలగింపు

- ఆస్పత్రిని సందర్శించిన మంత్రి దామోదర

- ఘటనపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు

ఖైరతాబాద్, జూన్ 4: ఎర్రగడ్డ మానసిక హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆర్‌ఎంవోను సస్పెండ్ చేయడంతోపాటు డైట్ కాంట్రాక్టును రద్దు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్పత్రిలో ఆహార పదార్థాల సరఫరా కాంట్రాక్ట్ రద్దు చేయడంతోపాటు శానిటేషన్ కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులను జారీ చేస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ అనిత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు ఆహార పదార్థాల కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని తేల్చారు.

కొత్త కాంట్రాక్టర్‌ను నియమించేవరకు చెస్ట్ హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్‌కు ఆహార సరఫరా బాధ్యతలు అప్పగించారు. హాస్పిటల్ ఆర్‌ఎంవో పద్మజ నిర్లక్ష్యం కూడా ఉన్నదని గ్రహించిన ప్రభుత్వం ఆమెను సస్పెండ్ చేసింది. బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాస్పిటల్‌ను సందర్శించి ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

కాగా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రగడ్డ మానసిక రోగులకు డైలీ డైట్‌తో పాటు స్వీట్, పండ్లను అదనంగా చేర్చి ఇచ్చారు. భోజనానంతరం దాదాపు 92 మంది రోగులు వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తుండగా మెరుగైన వైద్యం కోసం 18 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భూపాలపల్లికి చెందిన కరణ్ అనే వ్యక్తి మంగళవారం మృతిచెందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.