10-07-2025 12:22:44 AM
బీసీ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, రాజారామ్
ఖైరతాబాద్;జూలై 9 (విజయ క్రాంతి) : స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేసింది.
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వి.జి.ఆర్ నారగోని, బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్‌లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఆర్టికల్ 243 (డి) 243 (టి) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు.స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు చూస్తామని హెచ్చరించారు. తక్షణమే రెండు జీవోలను జారీ చేసి స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు పార్టీల కతీతంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), ఆర్టికల్ 16 (4) ప్రకారం ఏ వర్గాలకైతే సరైన ప్రాతినిధ్యం లేదని భావిస్తే.. కుల గణన లెక్కల ఆధారంగా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు.
ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కులగణన ద్వారా 63% రిజర్వేషన్లు ఇచ్చి, బీసీలకు లక్షకుపైగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవేళ కోర్టులు కొట్టివేస్తే రాజ్యాంగ సవరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నారు. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం తమ చేతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
బీసీలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లితే మండల్-2 ఉద్య మం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ హిందూ ఆజాది జాతీయ అధ్యక్షుడు బత్తుల సిద్దేశ్వరులు, బీసీ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు లోడంగి గోవర్ధన్ యాదవ్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, బీసీ ఆజాది సంగ్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ నాయకులు అంబాల నారాయణ గౌడ్, యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.