పేదింటి ఆడబిడ్డలకు అండగా ప్రభుత్వం
హనుమకొండ, జూన్ 15 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు, ఫలాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని 106 మంది లబ్ధిదారులకు రూ.1,06,12,296 విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నామని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రతి నెల రెండు పర్యాయాలు సీఎం సహాయనిధి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని లేదా తమ డివిజన్లలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి మధ్యవర్తులు, దళారులను నమ్మవద్దని, ప్రతి పథకం పూర్తిగా ఉచితంగానే అమలు అవుతోందని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ ఈ నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు తన ఓటరు వివరాలను తప్పనిసరిగా పరిశీలించి నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందడంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం అవసరమని తెలిపారు.
ప్రజలు ఓటరు నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతాయుతంగా పాల్గొనాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరే వరకు ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు యాదవ్, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీరజాలి, శ్రీమాన్, ఏనుగు మానస రాంప్రసాద్ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






