అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యం
- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
- మైసిగండిలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు
- ఓటరు జాబితాలో తప్పుల్లేకుండా పారదర్శకత కాపాడాలని పిలుపు
కడ్తాల్, జూన్ 15, (విజయ క్రాంతి): ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరికీ కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లపై ఉందని కల్వకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పులు దొర్లకుండా, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించబడకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.సోమవారం కడ్తాల్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మైసిగండి ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల దిశానిర్దేశం, శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు.
నియోజకవర్గంలోని 271 పోలింగ్ బూతులకు చెందిన ఏజెంట్లు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి ఏజెంట్లకు ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు, సవరణలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్లు అత్యంత చురుకుగా పనిచేయాలని స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కడ్బందీగావ్యవహరించాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడటంలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ శిక్షణా కార్యక్రమంలో టీపీసీసీ ఇంచార్జ్ సతీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బట్టు కిషన్ రెడ్డి, యాట నరసింహ, గూడూరు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.






