calender_icon.png 22 November, 2025 | 12:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

22-11-2025 12:14:09 AM

మహబూబాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి పట్ల తగిన ప్రాధాన్యం ఇస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కంబాల చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని చేప పిల్లల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 17 చెరువులు ఉండగా, కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్న కొన్నింటిని విడిపించి ఎఫ్ టి ఎల్ నిర్ధారించి బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

చెరువు శిఖాలలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదని, కబ్జాకోరులు చెరువు శికాన్ని విక్రయిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం నాణ్యమైన చేపపిల్లను పంపిణీ చేస్తున్నదని, మత్స్య సంపదను పెంచి మత్యకారులు అభివృద్ధి బాటలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ మాట్లాడుతూ 350 చెరువులు, 72 సొసైటీలు, 4,099 మంది సభ్యులు ఉన్న నియోజక వర్గములో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమం సజావుగా జరిగేలా సొసైటీ అధ్యక్షులు సభ్యులు చెరువు దగ్గరకు వచ్చినటువంటి చేప పిల్లలను సరిచూసుకొని కొలత ప్రకారం లెక్క ప్రకారం తీసుకొని చెరువులలో పోసుకోవాల్సిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ దామేర శ్రీనివాస్, సంఘ అధ్యక్షులు సింగాని అశోక్, కార్యదర్శి పిల్లి దశరథ, కొప్పు వీరయ్య, కోళ్ల నాగరాజు, ఐలయ్య, గుర్రం వెంకన్న, బాలకృష్ణ, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.