18-08-2025 12:00:00 AM
జవహార్నగర్, ఆగస్టు 17 (విజయక్రాంతి): జవహార్నగర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం యథేచ్ఛగా కొనసాగుతోంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారులు ప్లాట్లుగా మార్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నా, సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్లోని అత్యంత కీలకమైన ’నవరస గార్డెన్స్’ స్థలమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
తెరవెనుక బడా నేతల హస్తం?
కంచె చేను మేసే చందంగా కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ లే ఇక్కడి ప్రభుత్వ భూమును స్వాహా చే స్తున్నారనే ఆరొపనలున్నాయి. గ్రామ పంచాయితీ స్థాయి నుంచే ఇక్కడి గ్రామకంఠం స్థలాలను స్వాహా చేసిన ఘనులేవ్వరూ ? ప్రధాన రహాదారి పక్కనే షాపింప్ మాల్స్ నిర్మించినా అధికారులు ప్రేక్షకపాత్ర వహించారే తప్ప ఏలాంటి చర్యలు చేపట్టకపోవటం అధికారుల పనితీరుకు నిలు వెత్తు నిదర్శనం.
ఈ అక్రమ దందా వెనుక కొందరు బడా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రెవెన్యూ, మున్సి పల్ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని, కబ్జా దారులతో దోబూచులాట ఆడుతున్నారని ప్రజలు ఆరోపిస్తు న్నారు. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికే ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలం స్వాహా చేసిన ఘనులు ఉన్న స్థలాన్నిసైతం కబ్జా చేసేందుకు పావులుకదుపుతున్నారు. సర్వే నెంబరు 606లోని నవరస గార్డెన్స్ స్థలంతో పాటు సర్వే నెంబరు 501, 502, 476, 474, 475 లోని ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని, ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు ప్రారంభించి, కబ్జాదారుల ఆటలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి అధికారులు ఏలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
అధికారుల బోర్డుకే సవాల్.. ఆగని దందా
నవరస గార్డెన్స్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, ప్రజలకు తెలియజేయడానికి అక్కడ ఒక సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, భూ బకాసురులు మాత్రం ఆ బోర్డును, అధికారుల హెచ్చరికలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. ‘చట్టానికి కళ్ళు లేవు‘ అన్న చందంగా, రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వేసి, అమాయక ప్రజలకు నోటరీ పత్రాల ద్వారా ప్లాట్లను విక్రయిస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈ విక్ర యాల తతంగం అధికారుల దృష్టికి రాకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఈ దందాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.