07-01-2026 10:13:57 PM
తెలంగాణ అర్చక సమాఖ్య డిమాండ్
మేడిపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో సవరణలు చేసి అర్చకుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 121రద్దు చేయాలని తెలంగాణ అర్చక సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం జిహెచ్ఎంసి పరిధి మేడిపల్లిలో తెలంగాణ అర్చక సమైక్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక సమైక్య, తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ ఉపేందర్ శర్మ మాట్లాడుతూ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సమాన వేతనాన్ని అందించాలనే లక్ష్యంతో జీవో నెంబర్ 575 ను తెచ్చారని తెలిపారు.
ఈ చట్టం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న 5625 మందికి లబ్ధి చేకూరిందని, కానీ కొంతమంది అధికారుల కారణంగా ఈ జీవోలు అమలు కాకుండా చేశారని, ఫలితంగా రెండు వేలకు పైగా అర్చకులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు ఒకే చట్టం ఒకే న్యాయం ఒకే వేతనం అనే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అర్చకులు ఇతర సిబ్బంది కష్టంతో ఆలయాలు దిన దిన అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వానికి సైతం గణనీయంగా ఆదాయం సమ కోరుతుందనిత కానీ తమకు మాత్రం కేవలం రూ 5000 లోపు మాత్రమే వేతనం అందిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించి సమాన వేతన పద్ధతిని అమలు చేయాలని, అర్చకులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భీమా, సదుపాయం కల్పించాలని, పదవి విరమణ పొందిన అర్చకులకు పెన్షన్ ఇవ్వాలని, గ్రాడ్యుటీ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కుండా సురేఖను పలుమార్లు కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించామని వారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో చర్చించి తమకు న్యాయం చేయాలని అర్చకులు కోరారు.