13-11-2025 09:29:19 PM
మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి..
సెయింట్ మేరీస్ లో ముగిసిన స్పోర్ట్స్ మెమోటం..
గజ్వేల్ (విజయక్రాంతి): గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా నిర్వహించిన “స్పోర్ట్స్ మెమోటం - 2025” ముగింపు కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు-ఓటములు సహజం అన్నారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకుని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచుతాయన్నారు.
క్రీడా పోటీల్లో సాయి జి.డి.ఆర్ పాఠశాల 25 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను గెలుచుకోగా, సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ (ఎస్ ఎస్ సి) 24 పాయింట్లతో రెండో స్థానం, సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హై స్కూల్ (సిబిఎస్ ఈ) 24 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. ఈ వేడుకలో ట్రస్మ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సోమేశ్వర్ రెడ్డి, సెయింట్ జోసఫ్ పాఠశాల ప్రిన్సిపాల్ సుష్మ, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సెయింట్ మేరీస్ స్పోర్ట్స్ మెమోటంలో 15 ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సెయింట్ మేరీస్ కరస్పాండెంట్ గోపు ఇన్నా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.