calender_icon.png 10 May, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ప్రత్యేక చొరవతో జోరందుకున్న ధాన్యం కొనుగోళ్ళు

09-05-2025 09:37:14 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Collector Adwait Kumar Singh) ప్రత్యేక చొరవ చూపారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు అంశాలను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేకంగా జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనితో జిల్లాలో ధాన్యం కొనుగోలు, మిల్లులకు రవాణా, ఇతర సమస్యల పరిష్కారానికి క్లస్టర్ అధికారులు సమన్వయంతో పనిచేస్తుండగా రెండు రోజులుగా ధాన్యం కొనుగోళ్ళు, మిల్లులకు ఎగుమతి జోరుగా సాగుతోంది.

కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలు, డీసీఎం వాహనాలను సమకూరుస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.వీరబ్రహ్మచారి, డీఎస్ఓ ప్రేమ్ కుమార్ , సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి సమన్వయంతో పనిచేస్తూ , అవసరమైన చోటికి ఉన్నతాధికారులు వెళ్లి ఇబ్బందులు తొలగిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సమస్యలు ఎదురైతే సమన్వయంతో పరిష్కరించి ధాన్యం కొనుగోలను వేగవంతం చేస్తున్నారు. దీనివల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంది.

75,384.981 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2025 యాసంగి సీజన్లో రైతులు పండించిన 73,384.891 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గురువారం వరకు సేకరించినట్లు అధికారులు వెల్లడించారు. సీజన్ మొత్తంలో 1,96,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేయగా, 45,000 టన్నుల ధాన్యం ఏప్రిల్, 85,000 టన్నుల ధాన్యం మే నెలలో కొనుగోలు చేయాలని లక్ష్యం నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 55 శాతం ధాన్యం సేకరణ జరిగిందని చెప్పారు.

మరో 22 రోజులపాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు వెల్లడించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని  బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన 34 రైస్ మిల్లులకు సీఎంఆర్ బియ్యం కోసం తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 174 కోట్ల రూపాయలకు పైగా విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని, 80 శాతానికి పైగా రైతుల పేర్లను ఆన్లైన్ చేసి, 83 కోట్ల రూపాయలపైగా చెల్లింపులు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.