18-11-2025 04:56:44 PM
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి
నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీల కొరతను నివారించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా లారీలు రాక 1400 బస్తాల దాన్యం నిలిచిపోవడంతో రైతు సంఘం -సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలన చేసి ఆయన రైతులతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల 15 రోజులుగా రైతులు మార్కెట్లో ధాన్యం పోసి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇంకా 60 ధాన్యం రాశులు ఉన్నవని రబి సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఓవైపు దున్నకాలు మొదలుపెట్టి మరోవైపు మార్కెట్లలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ధాన్యం అమ్ముడుపోక చేతిలోకి డబ్బులు రాక పెట్టుబడులకు రైతులకు ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి లారీల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేయగానే రైతుకు ట్రక్ షీట్ ఇవ్వకుండా రైస్ మిల్లులో దించిన తరువాత ఇవ్వడంతో రెండు రోజులు ఆలస్యంగా దించడంతో తరుగుడు ఏర్పడి రైతులకు కోత విధిస్తున్నారన్నారని ఆయన పేర్కొన్నారు. సివిల్ సప్లై డిఎం తో ఫోన్లో సంప్రదించి విన్నవించగా సమస్యను పరిష్కరించేస్తామని ఆమె ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు బలుగూరి అంజయ్య, మాజీ ఎంపిటిసి బడుగు రమేష్, శాఖ కార్యదర్శి అంబటి మల్లారెడ్డి, నాయకులు దోమలపల్లి నరసింహ, దాడి మల్లారెడ్డి, కట్ట లక్ష్మా రెడ్డి, మార్తా భూపాల్ రెడ్డి,రైతులు తదితరులు పాల్గొన్నారు.