03-11-2025 08:09:32 PM
మర్రిగూడ తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు..
చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మర్రిగూడ మండల తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు అన్నారు.. సోమవారం మర్రిగూడ మండల పరిధిలోని శివన్న గూడెం గ్రామంలో రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ (ఎఫ్ఎస్సిఎస్) ఆధ్వర్యంలో సంఘం చైర్మన్ బాలం నరసింహతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 అందిస్తుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకాలకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తుందని అన్నారు. రైతులు తమ పంటను తక్కువ ధరకు వ్యాపారులకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అన్ని వసతులు కల్పిస్తుందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చి వరి ధాన్యమును అమ్ముకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మానిటరింగ్ ఆఫీసర్ శరత్,మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు అరుణ, సుజాత, సంఘం సీఈవో మధు, సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు ఉన్నారు.