04-11-2025 01:03:49 AM
							గుంతల రోడ్డుపై రాంగ్ రూట్‌లో..
ఓవర్ స్పీడ్‌తో దూసుకొచ్చిన లారీ ప్రమాదానికి ప్రధాన కారణాలు
-మీర్జాగూడ వద్ద మూలమలుపు
-మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడం
-రోడ్డుపైన లోతైన గుంతలు
-టిప్పర్ సామర్థ్యం 35 టన్నులు.. ప్రమాద సమయంలో దాదాపుగా 70 టన్నుల వరకు లోడ్
-టిప్పర్‌ను అతివేగం, అజాగ్రత్తగా నడపడం
-కంకరపై టార్ఫాలిన్ కప్పకపోవడం
-ఇరుకు రోడ్డు కావడం, డివైడర్ లేకపోవడం
-బస్సులో పరిమితి 50కు మించి 72 మంది దాకా ప్రయాణికులు ఎక్కడం
రంగారెడ్డి, నవంబర్ 3 (విజయక్రాంతి)/చేవెళ్ల: వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు హైదరాబాద్ బయల్దేరింది. రంగారెడ్డి జిల్లా బీజాపూర్ హైవేపై చేవెళ్ల మండలం ఇంద్రారెడ్డి నగర్ గేట్ల మధ్యలోని ప్రాంతానికి చేరుకోగా.. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో 19 మంది దుర్మరణం చెందారు. 24 మంది గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.
తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీఎస్ 34టీఏ 63540) సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు హైదరాబా ద్ బయల్దేరింది. 6.30 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ దాటగానే.. షాద్‌నగర్ నుంచి వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం చిట్టెంపల్లికి కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ (టీజీ06టీ3879) వేగంగా వచ్చి ఢీకొట్టింది.
బస్సు డ్రైవర్ క్యాబిన్ నుంచి ఐదు సీట్ల వరుసలపై టిప్పర్ అడ్డంగా పడటంతో సీట్లు విరిగి టాప్ చీల్చుకుపోయింది. టిప్పర్‌తో పాటు అందులో ఉన్న 60 నుంచి 70 టన్నుల కంకర బస్సు లో పడటంతో ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. తీవ్ర గాయాలై, ఊపిరాడక 18 మంది కంకరలో మృతి చెందారు. మరొకరు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాణా లు విడిచారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
స్థానికుల సహకారంతో కంకరలో కూరుకుపోయి న మృతదేహాలతో పాటు క్షతగాత్రులను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 14 మందిని చేవెళ్లలోని మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి, 10 మందిని వికారాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా టిప్పర్ సామర్థ్యం ౩౫ టన్నులే అయినా ప్రమాద సమయంలో 60 నుంచి 70 టన్నుల కంకర ఉన్నది. ఈ కంకర కింది పడి కొందరు, అద్దాలు తగిలి, సీట్ రాడ్లు గుచ్చుకొని ఇంకొందరు ప్రాణాలు విడిచారు. బస్సు కెపాసిటీ మందికాగా.. ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ఉన్నట్టు తెలిసింది.
టిప్పర్ ఓవర్ లోడ్.. ఓవర్ స్పీడ్
ఓవర్ కంకర లోడుతో ఉన్న టిప్పర్‌ను డ్రైవర్ అతివేగంగా నడుపుతూ వెళ్తున్నాడు. ఓవర్ స్పీడుతో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ కు వచ్చారు. లారీని ఢీకొట్టే ముందే ఎన్నో వాహనాలను ఓవర్ టేక్ చేసినట్లు గుర్తించారు. ప్రమాద స్థలానికి కొద్ది దూరంలో రోడ్డుపై గుంత ఉండటంతో తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్సుపైకి దూసుకెళ్లిన ట్లు తెలుస్తోంది. కంకర ఉండటంతో అదుపుకాక బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
మృతుల వివరాలు
పానుగుల కల్పన(45) హై దరాబాద్, తారాబాయి(45) తండా, వికారాబాద్(గృహిణి), గుర్రాల అఖిల(22) పూర్, యాలాల, తాం డూరు, నాగమణి (55) కర్ణాటక, గోగుల గుణమ్మ(60) హైదరాబాద్, మాగళ్ల హన్మంతు(44) దౌల్తాబాద్ మండలం, ఎండీ ఖలీద్(43) నగర్ కాలనీ, తాండూర్, థబుస్సం జహాన్ (38) దస్తగిరి బాబా (37) డ్రైవర్(బ్యాడ్జ్ నెం. 6006), మంతటి, బషీరాబాద్, కిష్టాపూర్ వెంకటమ్మ(21) నగర్, తాండూరు, లక్ష్మీ (40) యాలాల మండలం, కు డుగుంట బందప్ప(42) యాలా ల మండలం, సెలెహ(20) తాండూరు, జహీరా ఫాతిమా(40 రోజులు, సెలెహ కూతురు), ముస్కాన్ బేగం(21) తాండూరు, ఆకాశ్ దన్యకా మహారాష్ర్ట, టిప్పర్ డ్రైవర్, సాయి ప్రియ (18) తాండూరు, తనూప(20) తాండూరు, ఈడిగ నందిని(22) తాండూరు. కాగా వైద్య అధికారులు మృతదేహాలను గుర్తించడంలో కొంత ఇబ్బంది పడ్డారు. కొందరి ఆధార్ కార్డులు లేకపోవడంతో వివరాలు తెలుసుకుని పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యలకు అప్పజెప్పేసరికి ఆలస్యం అయ్యింది.
ఎంపీ, ఎమ్మెల్యేలకు నిరసన సెగ
ఘటనా స్థలానికి వెళ్లిన ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, విప్, ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. వేర్వేరుగా అక్కడి వెళ్లిన వారిని బాధిత కుటుంబ సభ్యలు ఎందుకొచ్చారంటూ నిలదీశారు. 15 ఏళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారని సబితారెడ్డిని, 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి రోడ్డెందుకు వేయలేదని ఎమ్మెల్యే కాలే యాదయ్యను, ఎంపీగా ఉండి ఇన్నాళ్లు రోడ్డు పనులు ఎందుకు ముందుకు సాగలేదని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు.
ఎప్పుడూ అధికార పార్టీలోనే ఉంటున్నా కనీసం రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని మహేందర్‌రెడ్డిని నిలదీశారు. నిత్యం ఈ రోడ్డుపైనే వెళ్తున్నా ఇక్కడిని జనాలపై ఎందుకు కనికరం ఉండడంతో ఏదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా మృతుల కుంటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
సీఐ శ్రీధర్‌కు గాయాలు
బస్సు ప్రమాదంలో క్షతగాత్రులను వెలికి తీసే సమయంలో సీఐ శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో కూరుకుపోయిన కంకరను జెసిబి సాయంతో తొలగిస్తుండగా జేసీబీ టైరు సీఐ ఎడమ కాళ్ల మీద నుంచి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన సీఐని చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు
మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు, ఆర్టీసీ తరఫున రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్యం కోసం రూ.2 లక్షలు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. మృతుల అంత్యక్రియలతో పాటు చికిత్స పొందుతున్న వారి పర్యవేక్షణ కోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు.
ఘటనకు సంబంధించి ఐజీ మహేశ్ భగవత్, సీపీ అవినాశ్ మహంతి, కలెక్టర్ నారాయణరెడ్డి, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చేవెళ్ల, పరిగి ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, రామ్మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించారు. బీజాపూర్ హైవే ఆలస్యానికి కేంద్రంలోని బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే పర్యావరణవేత్తలతో మాట్లాడి.. కేవలం 130 చెట్లను రీ లొకేట్ చేసి, చర్చలు జరిపి స్టే వెకేట్ చేయించి, గత నెల 31నే రోడ్డు పనులు ప్రారంభించామని వెల్లడించారు.
దర్యాప్తు చేపడుతున్నాం: సీపీ అవినాష్ మహంతి
బస్సు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి చెందడంతో ప్రమాదానికి గల కారణాలపై పూర్తి దర్యాప్తు చేపడుతున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం సిటీలోకి భారీ వాహనాలు, టిప్పర్ల రాకపోకలకు నిషిద్ధం. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్ గతంలోనే భారీ లోడ్‌తో కంకరతో సిటీలో రాకపోకలు సాగించినట్లు గుర్తించామన్నారు.
చందానగర్, రామచంద్రపురం వద్ద రాకపోకలు సాగించడంతో టిప్పర్‌పై రూ.3,270 వరకు జరిమానా కూడా ఉన్నట్టు తెలిపారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సైతం సిగ్నల్ జంపునకు సంబంధించి మూడు చలాన్‌లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆర్టీసీ బస్సు నడుపుతున్న దస్తగిరి బాబా, టిప్పర్ డ్రైవర్ మహారాష్ట్రకు చెందిన ఆకాశ్‌గా పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన లక్షనాయక్ వద్ద గత కొంతకాలంగా ఆకాశ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్ శివారులోని పటాన్‌చెరులోని ఒక క్రషర్ మిల్లు నుంచి కంకరలోడుతో వికారాబాద్‌కు వెళ్తుండగా మీర్జాపూర్ వద్ద ప్రమాదం చోటు చేసుకున్నదని చెప్పారు.
ముగ్గురు అక్కాచెల్లెళ్ల దుర్మరణం
వికారాబాద్ జిల్లా యాలాల మండలం పేర్కొంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ చాలా ఏళ్ల క్రితం తాండూరు పట్టణానికి వలస వచ్చాడు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కుమారుడు ఉన్నారు. పట్టణంలోని వడ్డెర గల్లిలో ఉంటూ ఎల్లయ్యగౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ, పిల్లలను అల్లారుముద్దుగా పెంచి పోషిస్తూ ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. అక్టోబర్ నెలలో పెద్ద కూతురు అనూష వివాహం ఘనంగా జరిపించాడు. రెండో కూతురు తనూష ఏంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది.
మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో హై విజన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్క అనూష వివాహం కోసం తాండూరు వచ్చిన తనూష, సాయిప్రియ, నందిని సోమవారం పరీక్షలు ఉన్నాయని చెప్పి తాండూరు బస్టాంట్ నుంచి బస్సులో హైదరాబాద్ బయల్దేరారు. వారిని తండ్రి ఎల్లయ్యగౌడే సోమవారం తెల్లవారుజామున బస్టాండ్‌లో దించి వెళ్లాడు. తండ్రికి చిరునవ్వుతో బాయ్ చెప్పిన ఆ అక్కాచెళ్లెల్లకు అదే ఆఖరి ప్రయాణం అయింది.
తండ్రి, కూతురు.. 40 రోజుల చిన్నారి మృతి
తాండూరు పట్టణం ఇందిరానగర్‌కు చెందిన ఖాలీద్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు సలేహా(20)ను కొన్నేళ్ల క్రితం వాహిద్‌తో పెళ్లి చేశారు. వారు హైదరాబాద్‌లోని షహీన్ నగర్‌లో ఉంటున్నారు. ఇటీవలే సలేహా కాన్పు కోసం తాండూర్ వచ్చింది. 40 రోజుల క్రితం కూతురు (జహీరా ఫాతిమా)జన్మనిచ్చింది. ఖాలిద్ కూతురును అత్తారింట్లో వదిలేందుకని పసికందుతో కలిసి బయల్దేరారు. ప్రమాదంలో ఖాలిద్, సలేహాతో పాటు 40 రోజుల చిన్నారి దుర్మరణం చెందారు.
డ్రైవర్‌కు చివరి ట్రిప్పు
బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సుమారు 20 ఏండ్లుగా పాత తాండూరులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం నడిపిన ప్రైవేటు బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్‌గా చేరాడు.
ప్రతిరోజూ ఇదే బస్సు హైదరాబాద్‌కు మొదటి సర్వీసు వెళుతోంది. సోమవారం మొదటి ట్రిప్పుకు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురికావడంతో అతనికి చివరి ట్రిప్ అయ్యింది. గత రెండేళ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫేయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరిని కాపాడారు. కాని సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించలేకపోయి.. తానుకూడా చనిపోయాడు.
అమ్మానాన్న మృతి.. అనాథలైన చిన్నారులు
యాలాల మండలం హాజీపూర్ గ్రా మానికి చెందిన కుడుగుంట బందప్ప(42), లక్ష్మీ భార్య భర్తలు. లక్ష్మీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరారు. ప్రమాదంలో బందెప్ప, లక్ష్మీ ఇద్దరూ మృతి చెందారు. తల్లిదండ్రుల మృతితో వారి ఇద్దరు ఆడబిడ్డలు భవాని, శివాని అనాథలుగా మిగిలారు. చేవెళ్ల ఆస్పత్రి వద్ద ఇద్దరు పిల్లలు ఒకరినొకరు పట్టుకొని రోధిస్తుండటం అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించింది. వారిని ప్రభుత్వమే ఆదుకుకోవాని స్థానికులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
దన్నారం తండాలో విషాదఛాయలు
వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని దన్నారం తండాకు చెందిన తారాబాయి(45) ప్రమాదంలో మృతిచెందిం ది. హైదరాబాదులోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో పనిచేసేందుకు రోజు మాదిరిగానే తండాకు చెందిన తారాబాయి, బుజ్జి బాయి ఇద్దరు బస్సులో బయలుదేరారు. బస్సు ప్రమాదానికి గురవడంతో తారాబాయి అక్కడికక్కడే మృతిచెందగా బుజ్జిబాయి తీవ్రగాయాలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
కంకరలో కూరుకుపోయి తల్లడిల్లిన తల్లి
తాండూరు పట్టణం విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజిద్ పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం ఆసుపత్రి పనిమీద మాజిద్ తన భార్య తబస్సుమ్ భేగం(35)తో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. చేవేళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయిన తల్లి తబస్సుమ్ తల్లడిల్లి తనువు చాలించింది. భర్త, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
ఉన్నత చదువుల కోసం వెళ్తూ..
యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, అలివేలు దంపతుల కూతురు అఖిలరెడ్డి(20) హైదరాబాద్‌లో ఏంబీఏ చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో సొంతూరుకు వచ్చిన ఆమె సోమవారం బస్సులో హైదరాబాద్ బయల్దేరింది. ప్రమాదంలో టిప్పర్‌లో ఉన్న కంకర మీదపడి బస్సులోనే మృతి చెందింది.
తల్లిని చూసేందుకు వచ్చి..
కర్ణాటక రాష్ర్టం ముదేళ్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన నాగమణి(45) తాండూరులో ఉంటున్న తల్లి వద్దకు మూడు రోజుల క్రితం వచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని పలకరించి.. మూడు రోజుల పాటు ఇక్కడే గడిపింది. అయితే హైదరాబాద్‌లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్లేందుకు తాండూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. చేవేళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో నాగమణి దుర్మరణం పాలయ్యింది.
2 లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని మోదీ
చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షత్రగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్రం నుంచి సాయం చేయనున్నట్టు తెలిపారు.
ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది: సీఎం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచా రం వ్యక్తం చేశారు. ప్రమాద ఘ టన జరిగిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. అధికారులు అక్కడికి వెళ్లి సహయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలియజేయాలన్నారు. బస్సు ప్రమాదంలో గాయపడినవారందరిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్, డీజీపీలను సీఎం ఆదేశించారు.
సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర వైద్య సాయంతో పాటు తగినన్ని అంబులెన్స్‌లు, వైద్య సిబ్బందిని రంగంలోకి దింపాలన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. మృతులు కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్
ఘోర ప్రమాదంపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతికి తెలిపారు.
మెరుగైన వైద్యం అందించాలి: కేటీఆర్
ప్రమాదంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 19 మంది మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని తక్షణమే ఆదుకోవాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరారు.